Nipah Virus Kerala : కేరళలో మళ్లీ నిఫా వైరస్ కలకలం రేగింది. కోజికోడ్ జిల్లాలో ఇటీవల మృతి చెందిన ఇద్దరు.. ఈ వైరస్ బారిన పడే ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ప్రకటించారు. ఈ క్రమంలోనే నిఫా వైరస్ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేయడానికి, పరిస్థితిని సమీక్షించడానికి కేంద్రం నుంచి నిపుణుల బృందాన్ని కేరళకు పంపినట్లు వెల్లడించారు.
కొయ్‌కోడ్‌లో ఇటీవల రెండు అసహజ మరణాలు నమోదయ్యాయి. జ్వర సంబంధిత లక్షణాలతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ.. ఆగస్టు 30న ఒకరు, సెప్టెంబరు 11న మరొకరు మృతి చెందారు. నిపా వైరస్ అనుమానంతో బాధితుల నమూనాలు సేకరించి పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. తాజాగా వారు పాతోనే మృతి చెందినట్లు నిర్ధరణ అయ్యింది. మరోవైపు.. వారితో క్లోజ్ కాంటాక్ట్‌లో ఉన్నవారికి ఇప్పటికే చికిత్స అందిస్తున్నారు.
కేరళ ప్రభుత్వం ఇప్పటికే కోజికోడ్ జిల్లావ్యాప్తంగా అలర్ట్ ప్రకటించింది. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి జిల్లాకు చేరుకుని పరిస్థితులను సమీక్షించారు. మంగళవారం స్థానికంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ముందుజాగ్రత్త చర్యగా ప్రజలంతా మాస్కు ధరించాలని సూచించారు. ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు. క్లోజ్ కాంటాక్ట్‌లో ఉన్న వారిలో ఎక్కువ మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నందున.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
2018 నుంచి 2021 వరకు కేరళలో అనేక నిపా వైరస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దక్షిణ భారత్‌లో 2018 మే19 మొదటి నిపా వైరస్ కేసు నమోదైంది. 2019 మరో నిపా కేసులు వెలుగులోకి వచ్చింది. 2021లోనూ మెదడవాపు వ్యాధితో చనిపోయిన బాలుడిలో నిపా వైరస్‌ను గుర్తించారు వైద్యులు.