నిపా వైరస్‌ను 1989లో మలేషియాలో తొలిసారిగా గుర్తించారు(nipah virus case). నిపా వైరస్ ఆతిథ్య జీవుల జాబితాలో.. పందులు, ఫ్రూట్ బ్యాట్ అనే గబ్బిలాలు, కుక్కలు, మేకలు, గొర్రెలు, పిల్లులు, గుర్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫ్రూట్ బ్యాట్స్‌లో ఇవి సహజంగానే ఉంటాయి. అయితే వాటిపై ఎటువంటి ప్రభావం చూపించలేవు. వైరస్ ఉన్న గబ్బిలాలతో ప్రత్యక్ష లేదా పరోక్ష కాంటాక్ట్ ద్వారానే.. నిపా వైరస్ మనుషులకు వ్యాపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వ్యాధి సోకిన గబ్బిలాల మూత్రం పండ్లు మీదకి చేరినప్పుడు.. ఆ పండ్లు, పళ్ల రసాల ద్వారా మనుషులకు వ్యాపించే ప్రమాదముందని పేర్కొంటున్నారు.
కొవిడ్‌తో పోలిస్తే నిపా వైరస్ అత్యంత ప్రమాదకరమైంది. కేరళలో(nipah virus kerala) నిపా వైరస్‌తో ఓ బాలుడు చనిపోవటం ఆందోళన రేకెత్తించింది. దీంతో నిపా వైరస్ ఉత్పరివర్తనం చెంది.. వ్యాప్తించే సామర్థ్యాన్ని మరింత పెంచుకుని.. మరింత మందికి విస్తరిస్తుందా? అనే భయాలు మొదలయ్యాయి. దీనికి తోడు నిపా వైరస్‌లో మరణాల శాతం యాభైకి పైగా ఉండటం, దీనికి ప్రత్యేకమైన టీకాలు, చికిత్స లేకపోవటం ఆ భయాలను మరింత పెంచుతున్నాయి.
అయితే కొవిడ్ అంత వేగంగా నిపా వైరస్ వ్యాపించకపోవడం ఒక్కటే ఊరటనిచ్చే అంశం. రోగి నుంచి వెలువడే స్రావాల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ముఖ్యంగా రక్తం, మూత్రం, ముక్కు, నోటి నుంచి వచ్చే స్రావాల్లో వైరస్ ఉంటుంది. కరోనా వైరస్ మాదిరిగా కాకుండా వ్యాధి సోకిన వ్యక్తితో.. సన్నిహితంగా మెలిగిన ప్రైమరీ కాంటాక్టు వ్యక్తులకే నిపా వైరస్ సోకుతోంది. సామూహిక వ్యాప్తి ఇప్పటివరకు వెలుగు చూడకపోవటం ఊరటనిస్తోంది. ఇదే సమయంలో కొవిడ్ తరహాలో కాకుండా నిపా వైరస్‌లోని ప్రోటీన్లు మెదడు, కేంద్ర నాడీకణాల్లోనే కేంద్రీకృతమవుతున్నాయి. కొవిడ్ వైరస్ తరహాలో నిపా వైరస్ ఎగువ శ్వాసకోశంలో ప్రతిరూపకాలను తయారుచేసే అవకాశాలు తక్కువ.
ప్రస్తుతం నిపా వైరస్ వ్యాపిస్తున్న తీరు చూస్తే.. దీనికి మహమ్మారిగా మారే అవకాశాలు తక్కువంటున్న నిపుణులు.. కాంటాక్ట్ ట్రేసింగ్, ప్రజల్లో అవగాహన, ప్రజారోగ్య చర్యలు అవసరమని చెబుతున్నారు. నిపా వైరస్‌కు టీకాలను అభివృద్ధి చేసే ముందు నిపా వైరస్ మహమ్మారిగా మారే ప్రమాదముందా అనే విషయాన్నిఅంచనా వేయాలని సూచిస్తున్నారు. ఒకవేళ ఉంటే టీకాలు అభివృద్ధి చేయాల్సిన ఇతర ప్రమాదకర వైరస్‌ల జాబితాలో దీని స్థానాన్ని అంచనా వేయాలంటున్నారు.
ఇదీ చూడండి:-కర్ణాటకకూ 'నిఫా' వ్యాప్తి- ఒకరికి పాజిటివ్!