NINL disinvestment: ఒడిశాలోని ప్రభుత్వ రంగ స్టీల్ ఉత్పత్తి పరిశ్రమ.. నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(ఎన్ఐఎన్ఎల్)ను దక్కించుకుంది టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్. నష్టాల్లో ఉన్న ఎన్ఐఎన్ఎల్ను రూ.12,100 కోట్లకు విక్రయానికి ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.
ఎంఎంటీసీ, ఎన్ఎండీసీ, బీహెచ్ఈఎల్, ఎంఈసీఓఎన్ అనే నాలుగు సీపీఎస్ఈలు సహా రెండు ఒడిశా ప్రభుత్వ పీఎస్‌యూలు ఓఎంసీ, ఐపీఐసీఓఎల్ల సంయుక్త వెంచర్ ఎన్ఐఎన్ఎల్. ఇది ఒడిశాలోని కళింగనగర్‌లో 1.1 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన స్టీల్ ప్లాంట్. ఈ సంస్థ భారీ నష్టాల్లోకి జారుకున్న క్రమంలో 2020, మార్చి 30న మూసివేశారు.
నష్టాల్లో ఉన్న ఈ స్టీల్ ప్లాంట్‌ను విక్రయించేందుకు కేంద్రం బిడ్లు ఆహ్వానించగా.. మూడు సంస్థలు(జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, నాల్వా స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్‌ల కన్షార్టియం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్) బిడ్లు దాఖలు చేశాయి. రూ.12,100 కోట్లతో బిడ్ దాఖలు చేసింది టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్(టీఎస్ఎల్పీ). మిగతా సంస్థల కన్నా ఎక్కువ కోట్ చేసిన క్రమంలో.. టీఎస్ఎల్పీ బిడ్‌ను ఆమోదించినట్లు తాజాగా ప్రకటించింది ప్రభుత్వం. షేర్ పర్చేస్ అగ్రిమెంట్(ఎస్పీఏ)పై సంతకాలు చేసేందుకు టీఎస్ఎల్పీకి లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను జారీ చేసింది. ఈ సమయంలో బిడ్ దక్కించుకున్న సంస్థ 10 శాతం నగదును చెల్లించాల్సి ఉంటుంది.