తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మూడేళ్ల క్రితమే నిక్కీ- సాహిల్ వివాహం.. రెండో పెళ్లి వద్దన్నందుకే హత్య' - దిల్లీ శ్రద్దా వాకర్ హత్య కేసు

దిల్లీ యువతి నిక్కీ యాదవ్ హత్య కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. నిక్కీ యాదవ్- సాహిల్​కు మూడేళ్ల క్రితమే పెళ్లి అయ్యిందని పోలీసులు తెలిపారు. ఆమెను హతమార్చిన తర్వాత నిందితుడు సాహిల్ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని వెల్లడించారు. నిక్కీ యాదవ్ హత్య కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు.

నిక్కీ యాదవ్ మర్డర్ కేసు
nikki yadav murder case

By

Published : Feb 18, 2023, 12:39 PM IST

దేశ రాజధాని దిల్లీలో జరిగిన యువతి నిక్కీ యాదవ్‌ హత్య కేసులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. నిక్కీని హత్య చేసి ఫ్రీజర్‌లో దాచిన కేసులో ప్రధాన నిందితుడు సాహిల్ గహ్లోత్‌కు సహకరించిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిక్కీని చంపేసిన విషయాన్ని తన తండ్రి వీరేంద్ర సింగ్, వరుసకు సోదరులైన ఆశిష్​, నవీన్​లతో పాటు స్నేహితులు అమర్‌, లోకేశ్​లకు చెప్పాడు. శవాన్ని ఫ్రీజర్‌లో పెట్టేసిన తర్వాత వారంతా కలిసి సాహిల్‌ వివాహానికి వెళ్లినట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడని క్రైమ్‌ బ్రాంచ్ ప్రత్యేక పోలీస్ కమిషనర్‌ రవీందర్ యాదవ్‌ చెప్పారు.

"2020లోనే సాహిల్​-నిక్కీ యాదవ్.. ఆర్య సమాజ్​లో వివాహం చేసుకున్నారు. నిక్కీ యాదవ్​-సాహిల్ సహజీవనంలో లేరు. వారిద్దరూ భార్యభర్తలే. ఫిబ్రవరి 10న తన కుటుంబం నిర్ణయించిన మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధం కాగా.. వద్దని నిక్కీని బతిమాలింది. అందుకు సాహిల్ నిరాకరించాడు. కోపోద్రిక్తుడైన సాహిల్​.. పథకం ప్రకారం నిక్కీని హత్య చేశాడు.​ అతడికి సహకరించిన ఐదుగురిని అరెస్ట్ చేశాం. వారిలో సాహిల్ సోదరుడు..దిల్లీ పోలీస్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నవీన్‌ కూడా ఉన్నాడు. ఈ హత్యలో అరెస్టైన సాహిల్ తండ్రి, సోదరులు, తండ్రి పాత్రపై దర్యాప్తు జరుగుతోంది."

--రవీందర్ యాదవ్‌, క్రైమ్‌ బ్రాంచ్ ప్రత్యేక పోలీస్ కమిషనర్‌

నిక్కీ యాదవ్ హత్య కేసులో అరెస్టైన ఐదుగురు నిందితులను పోలీసులు శుక్రవారం రాత్రి కోర్టులో హాజరుపరిచారు. నిందితులందరికీ కోర్టు 2 రోజుల రిమాండ్ విధించింది. ఆర్యసమాజ్​లో నిక్కీ యాదవ్​, సాహిల్​కు పెళ్లి చేసిన పూజారిని సైతం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. నిక్కీ యాదవ్​, సాహిల్ పెళ్లి చేసుకున్న విషయం తమ కుటుంబంలో ఎవరికీ తెలియదని నిక్కీ తండ్రి సునీల్ యాదవ్ తెలిపారు. తన కుమార్తెను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.

ఇదీ జరిగింది..
నిక్కీ, సాహిల్ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వారిద్దరికి 2020లో పెళ్లైంది. అయినా సాహిల్ ఫిబ్రవరి 9న మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయంపై నిక్కీ సాహిల్​పై ఆగ్రహం వ్యక్తం చేసింది. సాహిల్​ను ప్రశ్నించి పెళ్లి ప్రస్తావన తెచ్చింది. దీంతో ఆగ్రహించిన సాహిల్.. నిక్కీని అంతం చేయాలని నిశ్చయించుకున్నాడు. మొబైల్ ఛార్జింగ్‌ కేబుల్‌ను నిక్కీ మెడకు బిగించి ఆమెను హతమార్చాడు. అనంతరం శవాన్ని ఫ్రీజర్​లో దాచాడు. నిక్కీని హత్యచేసిన గంటల్లోనే సాహిల్‌ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. అందుకు అతడి తండ్రి, సోదరులు, స్నేహితులు సహకరించారు. నిక్కీ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు సాహిల్‌ను అరెస్ట్ చేశారు. విచారణలో అతడు నిక్కీని హత్యచేసినట్లు అంగీకరించాడు.

శ్రద్ధా వాకర్ హత్య కేసు..
ఇటీవలే దిల్లీలోను ఇలాంటి ఘటనే జరిగింది. శ్రద్ధా వాకర్ అనే యువతిని ఆమె ప్రియుడు హత్య చేశాడు. ఆమె శరీర భాగాలను ముక్కలుగా వేరుచేసి వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. ఈ కేసులో నిందితుడు అఫ్తాబ్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది జరిగిన ఈ హత్య దేశ వ్యాప్తంగా కలకలం రేపింది.

ABOUT THE AUTHOR

...view details