కరోనా కొత్త రకం వైరస్ వ్యాప్తి కారణంగా.. పలు రాష్ట్రాలు నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాయి. గురువారం రాత్రి 11 గంటల నుంచి శుక్రవారం ఉదయం ఆరు గంటల వరకూ దిల్లీలో కర్ఫ్యూ విధించారు. ఈ రోజు రాత్రి 8 గంటల తర్వాత ఇండియా గేట్ పరిసరాల్లో సాధారణ ప్రజలకు అనుమతి నిరాకరించిన పోలీసులు.. రాజ్‌పథ్, విజయ్‌చౌక్, పార్లమెంటు పరిసరాల్లోనూ ప్రజల రాకపోకలను నిషేధించారు. కన్నాట్ ప్లేస్, మార్కెట్ ప్రాంతాల్లోనూ ఆంక్షలు విధించారు. అయితే.. కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకే ఈ చర్యలు చేపట్టామని దిల్లీ పోలీసులు వెల్లడించారు.
నూతన సంవత్సరం నేపథ్యంలో కరోనా వ్యాప్తిని పెంచే సామూహిక సమావేశాలు, సంబరాలు జరిగే అవకాశం ఉన్నందున వాటిపై నిఘా పెట్టాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ బుధవారం అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు. అధిక సంఖ్యలో జనం గుమిగూడటాన్ని నివారించాలని, స్థానిక పరిస్థితులను బట్టి ఆంక్షలు విధించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు కఠిన ఆంక్షలను అమలుచేస్తున్నాయి.