40 మంది ఉపాధ్యాయులకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) (NIA news india) సమన్లు జారీ చేసింది. జమ్ముకశ్మీర్‌లో మైనారిటీలపై దాడులు, హత్యల వ్యవహారానికి సంబంధించిన కేసులో ఆ టీచర్లకు సమన్లు పంపింది. శ్రీనగర్‌లోని ఈద్గఢ్ ప్రాంతంలో పాఠశాల ఆవరణంలో ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన ప్రిన్సిపాల్ సుపీందర్ కౌర్, ఉపాధ్యాయుడు దీపక్ చంద్ హత్యపై ఎన్ఐఏ దర్యాప్తు(NIA raids in Jammu and Kashmir) చేపట్టింది. ఈ నేపథ్యంలోనే వివిధ పాఠశాలలకు చెందిన 40 మంది ఉపాధ్యాయులకు ఎన్ఐఏ సమన్లు పంపింది.
ఈ కేసును స్థానిక పోలీసుల నుంచి ఎన్ఐఏ అధికారికంగా బదిలీ చేసుకుంది. పౌరు హత్యలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు ఎన్ఐఏలోని(NIA news india) ఉగ్రవాద నిరోధక విభాగం అధిపతి తపన్ దేకాతో సహా ఐబీ ఉన్నతాధికారులు శ్రీనగర్‌లో దర్యాప్తు చేస్తున్నారు.
400 మంది అనుమానితుల అరెస్ట్..
ఈ హత్యలకు సంబంధించి.. వివిధ ప్రాంతాల్లో నమోదైన కేసుల ఆధారంగా 400 మందిని జమ్ముకశ్మీర్ పోలీసులు అనుమానితులుగా అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. వారందరికీ.. జమాత్-ఎ-ఇస్లామి, తెహ్రీక్-ఎ-హురియత్ సహా పలు ఉగ్రసంస్థలకు చెందిన వ్యక్తులతో సంబంధాలున్నట్లు ఉన్నత వర్గాలు తెలిపాయి.
"ఉగ్రవాదులు కాకుండా సాధారణ పౌరులు చనిపోతే వారికి త్వరగా న్యాయం చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు కేంద్ర హోంమంత్రి స్పష్టం చేశారు" అని సంబంధిత వర్గాలు తెలిపాయి.