NIA Searches in Telugu States:ఎన్ఐఏ(NIA) ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఈ తనిఖీలతో రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. గుంటూరు జిల్లా పొన్నూరులో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ వైద్యుడు, జిల్లా పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు రాజారావు ఇంట్లో వేకువజాము నుంచే తనిఖీలు చేస్తున్నారు. కాకుమాను మండలం కొండపాటూరులోని తమలపాకుల సుబ్బారావు నివాసంలో ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. పౌరహక్కుల సంఘం నేత రాజారావుకు సన్నిహితంగా ఉండే సుబ్బారావు.. ప్రజాతంత్ర పార్టీ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు.
NIA Raids in PFI Leaders Houses in Kurnool: కర్నూలులో పీఎఫ్‌ఐ నాయకుల ఇళ్లల్లో ఎన్‌ఐఏ సోదాలు
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో జాతీయ దర్యాప్తు సంస్థ- ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టు సానుభూతిపరులుగా ముద్రపడిన వారితోపాటు పౌరహక్కులు, ప్రజాసంఘాల్లో పనిచేస్తున్న వారి నివాసాలను జల్లెడ పడుతున్నారు. మంగళగిరి మండలం నవులూరులో చైతన్య మహిళా వేదిక సభ్యురాలు సిప్పోరా ఇంటితోపాటు తాడేపల్లి మండలం డోలాస్ నగర్ ప్రాంతాల్లో ప్రజాసంఘాల నాయకుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. తాడేపల్లి మహానాడు 13వ రోడ్డులో ఉంటున్న బత్తుల రమణయ్య నివాసంలో తనిఖీలు చేస్తున్న ఎన్ఐఏ అధికారులు మావోయిస్ట్ కార్యకలాపాలకు సహకారంపై విచారణ చేస్తున్నారు.
బాపట్ల జిల్లా సంతమాగులూరుకు చెందిన కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసరావు ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నారు. అనంతపురం బిందెల కాలనీలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు, కుల నిర్మూలన సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు ఇంట్లో ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి. చిల్లకూరు మండలం అల్లిపురంలో జిల్లా కుల నిర్మూలన పోరాట సమితి అధ్యక్షుడు కావలి బాలయ్య ఇంట్లో తనిఖీలు సాగుతున్నాయి. మాజీ సీఎం నేదురుమల్లి జనార్దనరెడ్డిపై బాంబు దాడి కేసులో కావలి బాలయ్య కుమార్తె పద్మ, అల్లుడు శేఖర్ నిందితులుగా ఉన్నారు. నెల్లూరులోని ఏపీసీఎల్సీ(APCLC) ప్రధాన కార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు నివాసంలో అధికారులు సోదాలు చేపట్టారు.
Varalaxmi Sarathkumar Drugs : నటి వరలక్ష్మికి ఎన్ఐఏ నోటీసులు!.. క్లారిటీ ఇదిగో..
ప్రకాశం జిల్లాలో కూడా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. చీమకుర్తి అంబేద్కర్ నగర్లో నివాసముంటున్న కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శి దుడ్డు వెంకట రావు ఇంట్లో ఎన్ఐఏ సోదాలు చేపట్టారు. నెల్లూరు జిల్లాలో తెల్లవారు జామునుంచి హక్కుల సంఘం (ఏపీసీఎల్సీ) నేతల ఇళ్లపై NIA దాడులు చేస్తున్నారు. ఫతేఖాన్ పేట రైతుబజార్ సమీపంలో చైతన్య మహిళా సంఘం నేత అన్నపూర్ణమ్మ ఇంట్లో సోదాలు సాగుతున్నాయి. అన్నపూర్ణతోపాటు ఇదే సంఘానికి చెందిన అనూష నివాసంలో గతంలోనూ ఎన్ఐఏ సోదాలు జరిగాయి. అనూష గత కొంతకాలంగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, కుల విమోచన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దళిత ఉద్యమాల్లో కృష్ణయ్య చురుకుగా ఉంటారు.
NIA Raids Today : ఖలిస్థానీ శక్తులపై NIA ఉక్కుపాదం.. ఆరు రాష్ట్రాల్లోని 51 ప్రాంతాల్లో సోదాలు
NIA Searches in Telangana:మరోవైపు తెలంగాణలోనూ ఉదయం నుంచి ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని న్యాయవాది సురేశ్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. విద్యానగర్‌లోని టీఆర్టీ కాలనీలో ఆయన నివాసంలో ఉదయం 6:00 నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు సికింద్రాబాద్.. అల్వాల్ సుభాష్ నగర్లో ఎన్ఐఏ తనిఖీలు జరుగుతున్నాయి. అల్వాల్‌లోని సుభాష్ నగర్లో ఉంటున్న అమరుల బంధుమిత్రుల సంఘం నాయకురాలు భవాని ఇంట్లో ఉదయం నుంచి తనిఖీలు చేపడుతున్నారు.
ఎన్ఐఏ తనిఖీలతో ఓరుగల్లు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పైడిపల్లిలోని మావోయిస్టు సృజన అలియాస్ నవత అలియాస్ రాగో ఇంట్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సభ్యులు మూడు గంటల పాటు విస్తృతంగా తనిఖీ చేశారు. ఎన్ఐఏ తనిఖీలతో పైడిపల్లి వాసులు భయాందోళనలకు గురయ్యారు. హన్మకొండలోని ప్రకాశ్ రెడ్డి పేటలోని పౌర హక్కుల నేత ఇంటిపై ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో మావోయిస్టు సృజన తల్లి శాంతమ్మ ఉపయోగించే చరవాణితోపాటు సృజన రాసిన ఉత్తరాలను విప్లవ సాహిత్య పుస్తకాలను ఎన్ఐఏ బృందం స్వాధీనం చేసుకుంది.