NIA Raids Today :వేర్పాటువాద సంస్థ ఖలిస్థాన్ విషయంలో భారత్-కెనడా మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ.. దేశంలో ఆ సంస్థకు మద్దతిస్తున్న ముఠాలపై జాతీయ దర్యాప్తు సంస్థ NIA కొరడా ఝుళిపిస్తోంది. ఆరు రాష్ట్రాల్లో ఖలిస్థాన్ గ్యాంగ్‌స్టర్లు, వారి అనుచరులను లక్ష్యంగా చేసుకుని సోదాలు జరుపుతోంది. బుధవారం తెల్లవారుజామున నుంచే NIA బృందాలు ఆరు రాష్ట్రాల్లోని 51 ప్రాంతాల్లో స్థానిక పోలీసుల సహకారంతో దాడులకు దిగాయి. పంజాబ్ మోగా జిల్లాలోని టఖ్తుపురా గ్రామంలో మద్యం కాంట్రాక్టర్ ఇంట్లో సోదాలు చేశాయి. ఖలిస్థాన్ మద్ధతుదారుడు అర్ష్ డాలా డిమాండ్ మేరకు ఆ కాంట్రాక్టర్ కొంత మొత్తం డబ్బులు చెల్లించినట్లు తెలిసింది. ఈ విషయమై NIA దర్యాప్తు చేస్తోంది.
NIA Raids Gangsters : ఉత్తరాఖండ్.. ఉధమ్‌సింగ్ నగర్‌లోని బాజ్పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గన్హౌస్లో NIA అధికారులు సోదాలు చేపట్టారు. దెహ్రాదూన్ జిల్లాలోని క్లెమన్‌టౌన్ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంట్లో, హరియాణాలోని నాలుగు ప్రాంతాల్లో NIA అధికారులు సోదాలు జరిపారు. ఆయా ఇళ్లలో తుపాకులు ఉన్నాయనే సమాచారంతో తనిఖీలు చేపట్టారు. కెనడాకు చెందిన తీవ్రవాద సంస్థతో సంబంధాలున్న ముఠాలకు చెందిన 43 మంది వ్యక్తులపైనా NIA దృష్టి పెట్టింది. ఈ మేరకు వారి వివరాలను ఫొటోలతో సహా వెల్లడించిన NIA.. కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ఆయా వ్యక్తుల ఆస్తులు, ఆదాయాల వివరాలు ఇవ్వాలని ప్రజలను కోరింది.
'ప్రజలారా.. ఆ వివరాలు ఇవ్వండి..'
గ్యాంగ్‌స్టర్లు... లారెన్స్ బిష్ణోయ్, జస్‌దీప్ సింగ్, కాలా జతేరి అలియాస్ సందీప్, వీరేందర్ ప్రతాప్ అలియాస్ కాలా రాణా, జోగిందర్ సింగ్‌ల చిత్రాలను.. ఇటీవల NIA ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. వారి పేరుతోగానీ, వారి అనుచరుల పేరిటగానీ ఉన్న ఆస్తులు, వ్యాపారాలు, వారి వ్యాపార భాగస్వామ్యులు, వారి కోసం పనిచేసే ఉద్యోగులు, కలెక్షన్ ఏజెంట్ల వివరాలను తమకు తెలపాలని ప్రజలను కోరింది. చండీగఢ్, అమృత్‌సర్‌లో ఖలిస్థాన్ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నుకు చెందిన ఆస్తులను.. ఇప్పటికే NIA జప్తు చేసింది.