NIA Raids PFI: ఎన్‌ఐఏ భారీ ఆపరేషన్.. 11 రాష్ట్రాల్లో ఒకేసారి సోదాలు.. పీఎఫ్ఐ కార్యాలయాలపై ముప్పేట దాడి.. 106 మంది కార్యకర్తలు అరెస్ట్.. ఉదయం నుంచి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయాలివి. చరిత్రలో ఎన్నడూలేనంత స్థాయిలో గురువారం వేకువజాము నుంచే సోదాలు జరుపుతోంది జాతీయ దర్యాప్తు సంస్థ. ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్, ఆయా రాష్ట్రాల పోలీసుల సహకారంతో పక్కా ప్రణాళికతో ఈ ఆపరేషన్ చేపడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ భారీ స్థాయిలో సోదాలు జరపడం, అనేక మందిని అరెస్టు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అసలు ఎందుకీ ఆపరేషన్?
ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చేవారు, ముష్కరుల కోసం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేవారు, నిషేధిత సంస్థల్లో చేరేలా ప్రజల్ని ప్రభావితం చేసేవారిని లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ చేపట్టామన్నది ఎన్‌ఐఏ మాట. ఇటీవల అనేక వివాదాలతో వార్తల్లో నిలిచిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా-పీఎఫ్ఐ కార్యాలయలాపైనే జాతీయ దర్యాప్తు సంస్థ ప్రధానంగా గురిపెట్టింది.
అరెస్టయిన వారు ఎవరు?
11 రాష్ట్రాల్లోని పీఎఫ్ఐ కార్యాలయాలు, నేతల ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేసింది ఎన్‌ఐఏ. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ అరెస్టు చేసింది. ఇలా గురువారం ఒక్కరోజే కేరళలో(22), మహారాష్ట్ర, కర్ణాటకలో 20 చొప్పున, తమిళనాడులో (10), అసోంలో 9, ఉత్తర్ప్రదేశ్లో 8, ఆంధ్రప్రదేశ్లో 5, మధ్యప్రదేశ్లో 4, పుదుచ్చేరి, దిల్లీలో ముగ్గురు చొప్పున, రాజస్థాన్లో ఇద్దరిని ఎన్‌ఐఏ అరెస్టు చేసింది.
అయితే.. వారి వివరాలను జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించలేదు. పీఎఫ్ఐ స్థానిక, రాష్ట్ర, జాతీయ స్థాయి నేతల ఇళ్లల్లో సోదాలు జరిపినట్లు వివరించింది. ఉగ్ర నిధులకు సంబంధించిన కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్, రాష్ట్రాల పోలీసులతో కలిసి ఈ అరెస్టులు చేసినట్లు తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లోనూ పీఎఫ్ఐ ప్రభావం ఉందా?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ ఎన్‌ఐఏ సోదాలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. గుంటూరు, నెల్లూరు, నిజామాబాద్లో జాతీయ దర్యాప్తు సంస్థ దాడులు నిర్వహించింది. పాత గుంటూరులోని పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టిన అధికారులు.. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పీఎఫ్ఐతో సంబంధం ఉన్న వారిని ప్రశ్నిస్తున్నారు.
కేంద్రం ప్రత్యేక ఆదేశాలు ఇచ్చిందా?
పీఎఫ్ఐ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిసింది. ఉదయం దేశవ్యాప్తంగా సోదాలు మొదలైనప్పటి నుంచి.. పరిస్థితుల్ని దిల్లీ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది కేంద్ర హోంశాఖ. ఇదే విషయమై జాతీయ భద్రతా సలహాదారు, హోంశాఖ కార్యదర్శి, ఎన్‌ఐఏ డీజీతో దిల్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.