NIA raids today: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అతడి ముఠాకు సంబంధించి వ్యవహారాలపై విచారణ ముమ్మరం చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు.. ముంబయిలోని సుమారు 20 ప్రాంతాల్లో సోమవారం సోదాలు నిర్వహించింది. 'డి' కంపెనీపై నమోదు చేసిన కేసులో విచారణ ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. నాగ్పాడ, గోరెగావ్, బోరివలి, సాంటాక్రూజ్, ముంబ్రా, భిండి బజార్ వంటి కీలక ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగినట్లు వెల్లడించారు.
నవాబ్ మాలిక్‌కు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లోని చాలా మంది అనుమానితులను కనుగొనే ప్రయత్నంలో ఉన్నట్లు ఎన్ఐఏ వర్గాల వెల్లడించాయి. అండర్ వరల్డ్ డాన్ కోసం ముంబయి కేంద్రంగా హవాలా వ్యాపారులు పని చేస్తున్నట్లు సమాచారం అందినట్లు పేర్కొన్నాయి. ఈరోజు జరిగిన దాడుల్లో ఎక్కువమంది హవాలా వ్యాపారుల నివాసాలు, కార్యాలయాలు ఉన్నట్లు వెల్లడించాయి. దావూద్‌కు చెందిన డి కంపెనీని ఉగ్రవాద సంస్థగా, 1993 ముంబయి వరుస పేలుళ్ల సూత్రధారిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా 2003లో ప్రకటించింది అమెరికా.