జమ్ముకశ్మీర్లో వరుసగా రెండో రోజూ సోదాలను కొనసాగించింది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ). కశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని రెండు ప్రదేశాల్లో సోదాలు చేసింది. ఉగ్రవాదులకు సహకరిస్తున్నారని అనుమానిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసింది.
భారత్లోని యువతలో ఉగ్రవాద భావాలు చొప్పించేందుకు ఐసిస్ ఉపయోగిస్తున్న 'వాయిస్ ఆఫ్ హింద్' పత్రికకు సంబంధించిన కేసులో ఈ సోదాలు జరిపింది ఎన్ఐఏ. స్థానికంగా నివసించే ఆకిబ్ అహ్మద్ సోఫీ(అలియాస్ నదీమ్), ముహమ్మద్ ఆరిఫ్ సోఫీ సోదరుల ఇంటిని తనిఖీ చేసినట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. అనంతరం, వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించాయి. మరోవైపు, గంజివారాలోని జియోగ్రాఫిక్ ప్రింటింగ్ ప్రెస్ను రెయిడ్ చేసి ఆరిఫ్ హుస్సెన్ ఖాద్రీ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు వివరించాయి. ఓ ల్యాప్టాప్, పలు కీలక పత్రాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నాయి.