NIA Raids PFI: దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల కేసులో పాపులర్ ఆఫ్ ఇండియా కార్యాలయాలపై ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయడం, ఉగ్ర సంస్థల్లో చేర్చేందుకు సమాయత్తం చేయడం వంటి అసాంఘిక కార్యకలాపాలను పాల్పడుతున్న 100 మంది పీఎఫ్ఐకి చెందిన కార్యకర్తలను అరెస్ట్ చేశారు అధికారులు. ఈ దాడులు ఉత్తర్ప్రదేశ్, కేరళ, తమిళనాడు సహా దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో గురువారం వేకువజామున జరిగాయి. రెండు రోజుల క్రితం తెలంగాణలోని నిజామాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో ఎన్ఐఏ సోదాలు నిర్వహించి పలువురు పీఎఫ్ఐకి చెందిన వారిని అదుపులోకి తీసుకుంది. వీరిని హైదరాబాద్లో ప్రశ్నిస్తున్నారు.
ఉగ్ర నిధుల కేసులో ఎన్ఐఏ సోదాలు.. 100 మంది అరెస్ట్
07:54 September 22
ఉగ్ర నిధుల కేసులో ఎన్ఐఏ సోదాలు.. 100 మంది అరెస్ట్
'ఇప్పటి వరకు ఇవే అతిపెద్ద దాడులు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, శిక్షణా శిబిరాలు నిర్వహించడం, నిషేధిత సంస్థలలో చేరడానికి వ్యక్తులను ప్రోత్సహించడం వంటి ఆరోపణలతో సోదాలు జరుగుతున్నాయి. పీఎఫ్‌ఐ జాతీయ, రాష్ట్ర, స్థానిక నేతల ఇళ్లపై, పార్టీ కార్యాలయాలపైనా దాడులు జరుగుతున్నాయి.'
--ఎన్ఐఏ అధికారులు
సుమారు 40 ప్రదేశాల్లో జరిగిన ఈ సోదాలను ఈడీ, ఎన్ఐఏ సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే పీఎఫ్ఐపై దాడుల్లో పోలీసులు భాగమైనట్లు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్వయంగా ఈ మొత్తం ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఉగ్రవాద మూలాలు, శిక్షణ వంటి వ్యవహారాలు పెద్ద ఎత్తున దేశంలో బయటపడడం వల్ల హోం శాఖ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. బిహార్, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటకలో జాయింట్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు సమాచారం.