అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో పీపీఈ కిట్ ధరించి, సీసీటీవీ కెమెరాలకు చిక్కిన వ్యక్తి.. సచిన్ వాజేనే అని జాతీయ దర్యాప్తు సంస్థ బుధవారం స్పష్టం చేసింది. కారులో పేలుడు పదార్థాలను.. వాజేనే పెట్టారని ప్రకటించింది. ఎవరో ఆదేశిస్తినే ఆయన ఈ పని చేసినట్లు ఆరోపించిన ఎన్ఐఏ.. వారిని కనిపెట్టేందుకు యత్నిస్తున్నట్లు తెలిపింది.
"పెద్ద రుమాలుతో సచిన్ వాజే తన తల కనపడకుండా కప్పుకున్నారు. ఆయన ఓ పెద్ద కుర్తా-పైజామాను ధరించారు. శరీరాన్ని మొత్తం పీపీఈ కిట్ కప్పి ఉంచలేదు. తన బాడీ ల్యాంగ్వేజీని ఎవరూ గుర్తించకుండా చూసేందుకు ప్రయత్నించారు."
-జాతీయ దర్యాప్తు సంస్థ
సచిన్ వాజే క్యాబిన్ వద్ద అంతకుముందు ఓ ల్యాప్‌టాప్‌ను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. అయితే.. అందులోని సమాచారం మొత్తం ముందే డిలీట్ చేసి ఉందని తెలిపింది. తన సెల్‌ఫోన్‌ను ఉద్దేశపూర్వకంగానే సచిన్ వాజే ఎక్కడో పడేశారని చెప్పింది.
సచిన్ వాజేను ఎన్ఐఏ శనివారం అరెస్ట్ చేసింది. ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం మార్చి 25 వరకు వాజేకు రిమాండ్విధించింది.