Hizb ut Tahrir case Updates : అంతర్జాతీయ ఇస్లామిక్ రాడికల్స్ సంస్థ హిజ్బుత్ తహ్రీర్‌ను దేశ వ్యాప్తంగా విస్తరించడమే లక్ష్యంగా పనిచేస్తున్న నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అధికారులు అరెస్ట్ చేశారు. మే 24వ తేదీన భోపాల్‌తో పాటు హైదరాబాద్‌లో దాడులు చేసిన మధ్యప్రదేశ్‌కు చెందిన ఏటీఎస్ అధికారులు 16మందిని అరెస్ట్ చేశారు. వీళ్లలో భోపాల్‌కు చెందిన 11మంది, హైదరాబాద్‌కు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేశారు. హిజ్బుత్ తహ్రీర్ కార్యకలాపాలను గుర్తించిన ఐబీ అధికారులు భోపాల్ పోలీసులను అప్రమత్తం చేశారు.
దీంతో ఏటీఎస్ అధికారులు ఏకకాలంలో భోపాల్, హైదరాబాద్‌లో దాడులు చేసి కరుడుగట్టిన 16మంది హిజ్బుత్ తహ్రీర్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టింది. పరారీలో ఉన్న సల్మాన్‌ను ఎన్ఐఏ అధికారులు ఇవాళ హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో అరెస్ట్ చేశారు. నగరంలో 2చోట్ల సోదాలు నిర్వహించి హార్డ్ డిస్క్‌లు, పెన్ డ్రైవ్‌లు, ఎస్డీ కార్డులతో పాటు ఇస్లామిక్ తీవ్రవాదానికి సంబంధించిన కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
NIA arrested Salman in Hizbut Tahrir case : హైదరాబాద్‌లో హిజ్బుత్ తహ్రీర్ కార్యకలాపాలకు మహ్మద్ సలీం నేతృత్వం వహిస్తుండగా.. సల్మాన్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నట్లు ఎన్ఐఏ తేల్చింది. సలీం హైదరాబాద్ లో గతేడాది రహస్యంగా నిర్వహించిన సమావేశంలోనూ భోపాల్‌కు చెందిన ఇస్లామిక్ రాడికల్స్ హాజరైనట్లు ఎన్ఐఏ గుర్తించింది. హైదరాబాద్‌కు చెందిన హిజ్బుత్ తహ్రీర్ కార్యకర్తలను ఆరుగురిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. బృందానికి నేతృత్వం వహిస్తున్న మహ్మద్ సలీం ఓ వైద్య కళాశాలలో ఫార్మాష్యూటికల్ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా పనిచేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. మహ్మద్ సలీం అసలు పేరు సౌరభ్ రాజ్ వైద్యగా పోలీసులు గుర్తించారు.