next CJI in line: సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ యు.యు.లలిత్ (ఉదయ్ ఉమేశ్ లలిత్) తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఆయన పేరును కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్.వీ రమణ. దీనిపై బుధవారం కేంద్ర న్యాయశాఖ కార్యాలయం నుంచి సీజేఐ జస్టిస్ రమణ కార్యాలయానికి వర్తమానం అందింది. తర్వాతి సీజేఐని సూచించాలని కేంద్ర న్యాయశాఖ పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ లలిత్ పేరును సిఫార్సు చేశారు సీజేఐ.
దేశంలో తీవ్ర సంచలనం సృష్టించిన ట్రిపుల్ తలాక్ సహా అనేక కీలక అంశాల్లో తీర్పు వెలువరించిన ధర్మాసనాల్లో జస్టిస్ యు.యు.లలిత్ భాగస్వామి. ఆయన సీజేఐ అయితే బార్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై అనంతరం సీజేఐ అయిన రెండో వ్యక్తి అవుతారు. 1971 జనవరిలో 13వ భారత ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ ఎస్.ఎం.సిక్రీ నేరుగా సుప్రీంకోర్టు జడ్జి అయిన మొదటి న్యాయవాది. 1964లో ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.