ప్రపంచ వ్యాప్తంగా కరోనా థర్డ్‌వేవ్ ప్రారంభమవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించిన నేపథ్యంలో.. రానున్న 100 రోజులు అత్యంత కీలకమని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. చాలా దేశాల్లో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయని హెచ్చరించింది. యావత్ ప్రపంచం మూడో ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోన్న వేళ.. భారతీయులు బాధ్యతగా వ్యవహరించి కొవిడ్ నిబంధనలు పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది.
'ప్రపంచ దేశాలు థర్డ్‌వేవ్ వైపు వెళుతున్నాయి. ఉత్తర, దక్షిణ అమెరికాలు తప్పితే మిగతా ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. అందుచేత దీన్ని హెచ్చరిక (రెడ్ ఫ్లాగ్)గా భావించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా సూచించారు. ముఖ్యంగా థర్డ్‌వేవ్‌ను ఆపాలనే లక్ష్యాన్ని మాకు నిర్దేశించారు. ఇది వాస్తవంగా సాధ్యమైనదే' అని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ పేర్కొన్నారు. స్పెయిన్‌లో కరోనా వైరస్ వారపు కేసుల్లో 64 శాతం, నెదర్లాండ్‌లో 300శాతం పెరిగాయి. థాయిలాండ్‌లో చాలా రోజులుగా పరిస్థితులు నియంత్రణలోనే ఉన్నప్పటికీ తాజాగా అక్కడ మరోసారి వైరస్ ఉద్ధృతి పెరిగింది. ఆఫ్రికాలోనూ పాజిటివ్ కేసుల్లో 50 శాతం పెరుగుదల కనిపిస్తోంది. మయన్మార్, బంగ్లాదేశ్, మలేసియా, ఇండోనేసియా దేశాల్లో ఊహించని విధంగా వైరస్ తీవ్రత పెరుగుతోందని వీకే పాల్ గుర్తుచేశారు.
హెర్డ్ ఇమ్యూనిటీకి చాలా దూరం..