Newspaper Sculpture Art In Maharashtra : కాదేదీ కళకు అనర్హం. అగ్గిపుల్లా, సబ్బుబిల్లా ఏదైతేనేం. వినూత్న ఆలోచనలు, చేయాలనే తపన ఉండాలే గానీ.. శిలలో శిల్పి శిల్పాన్ని చూసినట్లు.. ప్రతీ వస్తువుతో అద్భుతాలు సృష్టించవచ్చు. అలాగే.. మహారాష్ట్ర నాగ్‌పుర్‌లో కళాకారుడు జానకీరామ్ అయ్యర్ మనం రోజూ చూసే దినపత్రికలతో ముచ్చటైన శిల్పాలను తయారు చేస్తున్నారు.
నాట్య దేవుడైన నటరాజుని విగ్రహం వార్తా పత్రికలతో తయారు చేశారు జానకీరాం. అచ్చం పంచలోహాలతోనో, ఇత్తడితోనో తయారు చేసినట్లుగానే ఇది ఉంటుంది. అయ్యర్ దీనిని న్యూస్‌పేపర్ అల్లికతో తయారు చేశారు. వార్తా పత్రికలను అల్లడం, వాటిని కత్తిరించడం, మలచడం వంటివి చేస్తూ అయ్యర్ వీటిని రూపొందించారు. మొదట్లో కాగితాన్ని అల్లడం ద్వారా విగ్రహాలను తయారు చేసేవారు అయ్యర్. క్రమంగా కార్వింగ్ చేస్తూ ఈ పని చేయడం మొదలుపెట్టారు.
"మా ఇంట్లో కాగితాలను ముక్కలుగా చేసి ట్రే తయారు చేశాను. తర్వాత చేసిన మౌల్డింగ్ గొప్పగా అనిపించింది. మెల్లమెల్లగా పిచ్చుక, ఏనుగు వంటి కొన్ని వస్తువులను తయారు చేయడం ప్రారంభించాను."