Newsclick Founder Arrested :చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం(UAPA) కింద అరెస్టయిన ఆన్‌లైన్ పోర్టల్ న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ, HR చీఫ్ అమిత్ చక్రవర్తిని న్యాయస్థానం 7రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. చైనాకు అనుకూలంగా వార్తా కథనాలు రాసేందుకు నిధులు అందుకున్నారనే ఆరోపణలపై దిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు మంగళవారం న్యూస్ క్లిక్ కార్యాలయంతోపాటు 30 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న అనేక మంది జర్నలిస్టులను ప్రశ్నించారు. అనంతరం న్యూస్‌క్లిక్ పోర్టల్ వ్యవస్థాపకుడు ప్రబీర్, HR చీఫ్ అమిత్ చక్రవర్తిని అరెస్ట్ చేశారు. వారిద్దరినీ కోర్టులో హాజరుపర్చగా ఏడురోజుల పోలీసు కస్టడీకి అనుమతించినట్లు అధికారులు తెలిపారు. దిల్లీలో ఉన్న న్యూస్‌క్లిక్ కార్యాలయాన్ని సీజ్ చేసిన పోలీసులు 46మంది అనుమానితులను ప్రశ్నించటంతోపాటు వారి నుంచి ల్యాప్‌ట్యాప్‌లు, మొబైల్ ఫోన్లు, ఇతర దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
ఆరుగంటలకుపైగా విచారణ..
బుధవారం ఉదయం ప్రారంభమయిన సోదాలు దిల్లీ-NCRలోనూ కొనసాగాయి. ఈ కేసుతో సంబంధమున్న కొందరు పాత్రికేయులు ఊర్మిళేష్, ఔనింద్యో చక్రవర్తి, అభిసార్ శర్మ, పరంజోయ్ గుహా ఠాకుర్తాతో పాటు చరిత్రకారుడు సోహైల్ హష్మీ, వ్యంగ్య రచయిత సంజయ్ రాజౌరా, సెంటర్ ఫర్ టెక్నాలజీ & డెవలప్‌మెంట్‌కు చెందిన డి రఘునందన్‌ను అధికారులు ప్రశ్నించారు. ఆరు గంటలకుపైగా సాగిన ఈ విచారణ అనంతరం వారిని వెళ్లేందుకు అనుమతించారు.
'ఈ దాడులు అందుకే..' : కాంగ్రెస్
న్యూస్‌క్లిక్‌పై దాడులను ప్రతిపక్ష కాంగ్రెస్ ఖండించింది. బిహార్‌లో కులగణన ద్వారా బయటపడిన సంచలన నిజాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వం ఇటువంటి చర్యలకు దిగుతోందని ఆరోపించింది. దేశవ్యాప్తంగా కులగణనకు డిమాండ్ పెరుగుతోందని.. దీనిని కప్పిపుచ్చేందుకే ఈ రకమైన దాడులు జరుపుతున్నారని కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేడా పేర్కొన్నారు. వార్తా పోర్టల్‌పై దాడులపై దిల్లీ పోలీసుల తీరును ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా తీవ్రంగా తప్పుబట్టింది. తాజా పరిణామాలన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్నామని.. త్వరలోనే పూర్తి వివరాలతో ఓ ప్రకటనను విడుదల చేస్తామని చెప్పింది.