Newsclick CBI Raid : మనీ లాండరింగ్‌తో పాటు చైనాకు అనుకూలంగా వార్తలు రాస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆన్‌లైన్ పోర్టల్ న్యూస్ క్లిక్‌పై.. తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థ మరో కేసు నమోదు చేసింది. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యూలేషన్ యాక్ట్ (ఎఫ్సీఆర్ఏ) నిబంధనలు అతిక్రమించారన్న ఆరోపణల నేపథ్యంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే బుధవారం న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకులు ప్రబీర్ పుర్కాయస్థ నివాసంతో పాటు మరో ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
అంతకుముందు ఉపా చట్టం కింద కేసు నమోదు చేసిన దిల్లీ పోలీసులు.. న్యూస్‌క్లిక్ సంస్థకు చెందిన దిల్లీ కార్యాలయం, సిబ్బంది నివాసాలు సహా 30 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. న్యూస్ క్లిక్‌కు చెందిన కొందరు జర్నలిస్టుల ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్ల నుంచి డేటా తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కొందరు జర్నలిస్టులతో పాటు సంస్థ వ్యవస్థాపకులు ప్రబీర్ పుర్కాయస్థను దిల్లీ ప్రత్యేక విభాగం కార్యాలయానికి తీసుకెళ్లారు. సుదీర్ఘ విచారణం అనంతరం ప్రబీర్ సహా మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఆయనతో పాటు HR చీఫ్ అమిత్ చక్రవర్తిని కోర్టులో హాజరుపరచగా.. ఇద్దరికీ న్యాయస్థానం 7రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది.
UAPA case against NewsClick : కాగా, న్యూస్‌క్లిక్‌పై దిల్లీ పోలీసులు కఠినమైన ఉపా కింద కేసు నమోదు చేశారు పోలీసులు. భారత సార్వభౌమత్వాన్ని విచ్ఛిన్నం చేసేందుకు చైనా నుంచి న్యూస్‌క్లిక్‌కు భారీగా నిధులు అందాయని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. దేశంపై అసంతృప్తిని ప్రేరేపించేలా వ్యవహరించారని పోలీసులు వివరించారు. 2019 లోక్‌సభ ఎన్నికల వేళ ఎలక్షన్ ప్రక్రియను దెబ్బతీసేందుకు న్యూస్‌క్లిక్ ఎడిటర్-ఇన్-చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థ P.A.D.S అనే సంస్థతో పాటు పలువురు జర్నలిస్టులతో కలిసి కుట్రలు చేశారని పోలీసులు ఆరోపించారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రచార విభాగంలోని ఓ వ్యక్తి ఈ విదేశీ నిధులను పంపుతున్నట్లు తెలిపారు.