ఛత్తీస్‌గఢ్ రాయ్‌పుర్‌లో విషాదం నెలకొంది. మ్యారేజ్ రిసెప్షన్ సందర్భంగా డ్రెస్ మార్చుకునేందుకు గదిలోకి వెళ్లిన ఓ నవ దంపతులు.. అనుమానాస్పద రీతిలో మరణించారు. దీంతో ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి. మృతులను అస్లాం(24), కహక్షా బానో(22)గా పోలీసులు గుర్తించారు. తిక్రాపారా పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రిజ్‌నగర్‌లో శుక్రవారం సాయంత్రం జరిగిందీ ఘటన.
ఫిబ్రవరి 19న అస్లాం, కహక్షాకు వివాహం జరిగింది. మంగళవారం రాత్రి వీరిద్దరి రిసెప్షన్‌కు ఏర్పాటు చేశారు కుటుంబసభ్యులు. ఈ క్రమంలో రిసెప్షన్‌కు రెడీ అయ్యేందుకు నవ దంపతులిద్దరూ మంగళవారం సాయంత్రం ఒకే గదిలోకి వెళ్లారు. ఎంతసేపటికి వారు బయటకు రాలేదు. ఒక్కసారిగా గదిలో నుంచి వధువు కహక్షా బానో అరుపులు వినిపించాయి. వెంటనే కుటుంబ సభ్యులు డోర్ కొట్టినా ఎవరూ తీయలేదు. కిటికీ నుంచి చూడగా రక్తపు మడుగులో అపస్మారకస్థితిలో దంపతులిద్దరూ ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు కుటుంబ సభ్యులు.
పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని తలుపులు పగలగొట్టి మృతదేహాలను బయటకు తీశారు. అప్పటికే దంపతులు మరణించారు. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఫోరెన్సిక్ బృందాలను రంగంలోకి దించి తనిఖీలు నిర్వహించారు. భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగి.. భార్యను కత్తితో దాడి చేసి ఆమె భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.