హనీమూన్ కోసం ఇండోనేషియా వెళ్లిన ఓ భారతీయ నవ వధూవరులు.. సముద్రంలో పడి చనిపోయారు. పెళ్లైన పది రోజులకే.. ప్రాణాలు కోల్పోయారు. అనుకోకుండా జరిగిన బోటు ప్రమాదంలో.. ఇద్దరూ మృతి చెందారు. ఆనందంగా హనీమూన్‌కు వెళ్లిన నూతన దంపతులు.. ఇలా ప్రమాదంలో మృతి చెందడం వల్ల ఇరువురి కుటుంబాల్లో విషాద చాయలు అలుముకున్నాయి.
తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన లోకేశ్వరన్, విబుష్నియాకు కొత్తగా పెళ్లి జరిగింది. జూన్ 1నే స్థానికంగా ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో ఘనంగా వీరి వివాహం జరిగింది. వృత్తి రీత్యా లోకేశ్వరన్, విబుష్నియా వైద్యులు. పెళ్లి అనంతరం నూతన వధూవరులిద్దరు కలిసి.. ఇండోనేషియాకు హనీమూన్ కోసం వెళ్లారు. జూన్ 9న ఓ మోటార్ బోట్‌పై సముద్రంలో విహారం చేసేందుకు వెళ్లారు. ఇద్దరు ఫొటోలు తీసుకుంటున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న పడవ ఒక్కసారిగా అదుపు తప్పింది. ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయింది. దీంతో లోకేశ్వరన్, విబుష్నియా సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి లోకేశ్వరన్ మృతదేహాన్ని వెలికితీసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. విబుష్నియా మృతదేహం ఇంకా లభించలేదని.. గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు. కాగా లోకేశ్వరన్, విబుష్నియా మృతదేహాలను భారత్‌కు తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.