New Toll System In India : జాతీయ రహదారులపై ప్రయాణాన్ని మరింత సులువుగా మార్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. టోల్గేట్ల వద్ద ప్రయాణికులు అర నిమిషం కూడా వేచి ఉండాల్సిన అవసరం లేకుండా.. కొత్త విధానానికి భారత ప్రభుత్వం త్వరలోనే శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విధానం ఏంటంటే..
హైవేలపై టోల్‌ప్లాజాల వద్ద బ్యారియర్లు లేని వ్యవస్థను ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రయత్నం విజయవంతమైతే.. ప్రయాణికులు టోల్ గేట్ దగ్గర కనీసం అర నిమిషం అయినా ఆగాల్సిన పని లేకుండా హైవేపై దూసుకుపోవచ్చు. ఈ విషయాన్ని జాతీయ రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ వెల్లడించారు. టోల్ విధానంలో మరికొన్ని మార్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. "రహదారులపై ప్రయాణించిన దూరానికే ఛార్జీలు వసూల్ చేసే విధానం తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం ఈ విధానంపై ట్రయల్స్ జరుపుతున్నాము. ఈ ట్రయల్స్ విజయవంతమైతే.. త్వరలోనే కొత్త విధానాన్ని దేశంలో ప్రవేశపెట్టనున్నాము. ఈ ప్రయత్నం ద్వారా పౌరులకు ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది" అని ఆయన అన్నారు.