Nairobi Fly Acid Fly Bengal: బంగాల్లో గత కొద్ది రోజులుగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. శిలిగుడి, డార్జిలింగ్ సహా ఉత్తర బంగాల్లోని పలు ప్రాంతాల్లో 'నైరోబీ ఫ్లై' అనే ఆఫ్రికన్ ఈగలు.. ప్రజల చర్మంపై కుడితే అస్వస్థతకు గురిచేస్తున్నాయి. దాంతో అనేక మంది ప్రజలు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. అయితే వీటివల్ల అంత భయపడాల్సిన పని లేదని, కానీ జాగ్రత్తలు మాత్రం తప్పకుండా పాటించాలని వైద్యులు చెబుతున్నారు.
ఆ పదార్థం వల్ల.. 'నైరోబీ ఫ్లై' లేదా 'యాసిడ్ ఫ్లై' అనేది ఒక ఆఫ్రికన్ ఈగ. నారింజ, ఎరుపు, నలుపు మూడు రంగుల్లో ఈ కీటకం ఉంటుంది. ముఖ్యంగా ఈ కీటక శరీరంలో పెడిటిన్ అనే ఆమ్ల పదార్థం(యాసిడ్) ఉంటుంది. ఇది మానవ చర్మానికి హాని కలిగిస్తుంది. ప్రధానంగా వర్షాలు ఎక్కువగా కురిసే ప్రాంతాల్లో ఈ ఈగలు సంచరిస్తాయి. ఉత్తరాదిలో హిమాలయాల దిగువన అధిక వర్షపాతం కారణంగా అక్కడ తిరుగుతున్నాయి. గతేడాది కంటే ఈ సంవత్సరం వర్షపాతం ఎక్కువగా నమోదవ్వడం వల్ల 'యాసిడ్ ఫ్లై'ల సంచారం అసాధారణ స్థాయిలో పెరిగింది. చెప్పాలంటే ఈ కీటకం.. చర్మంపై కుట్టదు. కానీ ఒంటిపై అవి వాలినప్పుడు వాటిని కొడితే మాత్రం రసాయనం లాంటి పదార్థాన్ని విడుదల చేస్తాయి. ఆ కారణంగా చర్మంపై దద్దుర్లు వస్తాయి. ఆ తర్వాత అది అంటువ్యాధిలా మారే అవకాశం ఉంది.