Supreme Court Handbook on Combating Gender Stereotypes : కోర్టుల్లో కేసుల విచారణ, తీర్పుల్లో మహిళల పట్ల లింగ వివక్ష లేకుండా చూసే విషయంలో కీలక ముందడుగు పడింది. విచారణ సమయంలో మహిళల ప్రస్తావనలో ఉపయోగించాల్సిన పదాలు, వాక్యాలకు సంబంధించి ఓ హ్యాండ్‌బుక్‌ను బుధవారం ఉదయం విడుదల చేసింది సుప్రీంకోర్టు. కోర్టు తీర్పు వెలువరించే సమయంలో అనుచిత పదాలు వాడకుండా ఉండేందుకు న్యాయమూర్తులకు తగు సూచనలు చేసింది. 'హ్యాండ్‌బుక్ ఆన్ కంబాటింగ్ జెండర్ స్టీరియోటైప్స్' పేరుతో 30 పేజీల పుస్తకాన్ని విడుదల చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్. ఇందులో మహిళలను కించపరిచే విధంగా ఉన్న 40 పదాలను గుర్తించింది సర్వోన్నత న్యాయస్థానం. కోర్టులు గతంలో ఇచ్చిన తీర్పుల్లో మహిళలను ప్రస్తావిస్తూ చేసిన అనేక అనుచిత పదాలను హ్యాండ్ బుక్‌లో పొందుపరిచింది. వాటి బదులుగా వాడాల్సిన పదాలను సూచించింది.
"కోర్టు తీర్పుల్లో మహిళలపై వివక్ష చూపే విధంగా వినియోగించే పదాలు సరైనవి కావు. అయితే, ఆ తీర్పులను విమర్శించడం ఈ పుస్తకం ఉద్దేశం కాదు. లింగత్వానికి సంబంధించి మూసపద్ధతులు ఎలా ఆచరణలో ఉన్నాయో చెప్పేందుకే ఈ పుస్తకాన్ని రూపొందించాం"
--జస్టిస్ డీవై చంద్రచూడ్, ప్రధాన న్యాయమూర్తి