Corona Cases in India: దేశవ్యాప్తంగా గత కొన్నిరోజులుగా కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రోజువారీ కేసుల సంఖ్య గత మూడు నెలల గరిష్ఠానికి చేరుకుంది. ఇలా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగడానికి కొత్త వేరియంట్ కారణమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జీనోమ్ సీక్వెన్సింగ్‌ను భారీ స్థాయిలో చేపట్టాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఒక వేళ దీన్ని చేపట్టకుంటే.. వైరస్ ఉద్ధృతికి కారణాలు తెలుసుకోలేమని హెచ్చరిస్తున్నారు.
సీక్వెన్సింగ్ పెంచాల్సిందే
గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 4518 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో క్రియాశీల కేసుల సంఖ్య 25వేలు దాటడంతోపాటు పాజిటివిటీ రేటు ఒకశాతం దాటింది. అయితే, ఇందుకు ఒమిక్రాన్ దాని ఉపరకాలే కారణం అయినట్లు భావిస్తున్నప్పటికీ వ్యాధి తీవ్రత మాత్రం తక్కువగానే ఉందని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ సొసైటీ (TIGS) డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా పేర్కొన్నారు. ఒకవేళ బాధితులు అనారోగ్యం బారినపడితే మాత్రం దాన్ని తీవ్రంగా పరిగణించాలని.. ముఖ్యంగా కొత్త వేరియంట్ వచ్చే అవకాశం ఉన్నందున వాటిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అందుకే ఎంతో కీలకమైన జీనోమ్ సీక్వెన్సింగ్‌ను అధికంగా చేపట్టాలని సూచించిన ఆయన.. ఆస్పత్రికి వచ్చే ప్రతి వ్యక్తి నమూనాలకు సీక్వెన్సింగ్ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి వైరస్‌లు ఎప్పుడూ మార్పులకు గురౌతూనే ఉంటాయని.. వైరస్ మార్పులకు లోనైన సమయాల్లో కేసుల సంఖ్య పెరగడం సాధారణమేనని ఎయిమ్స్ నిపుణులు డాక్టర్ సంజయ్ రాయ్ పేర్కొన్నారు. అయితే రెండో, మూడో వేవ్‌ల నాటి పరిస్థితి ప్రస్తుతం దేశంలో లేదని డాక్టర్ సంజయ్ రాయ్ అభిప్రాయపడ్డారు.