అఫ్గానిస్థాన్ సంక్షోభం వల్ల శరణార్థుల(afghan refugee crisis) సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. అమెరికా బలగాలన్నీ దేశం విడిచి వెళ్లిపోతుండగా.. అఫ్గాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్ల నుంచి తమను తాము రక్షించేందుకు స్థానిక పౌరులు పొరుగు దేశాలకు పయనమయ్యారు. తాలిబన్ల గత పాలనను దృష్టిలో ఉంచుకొని భయాందోళనలతో పెట్టెబేడా సర్దుకోకుండానే ఒట్టిచేతులతో దేశం విడిచి వెళ్తున్నారు. వీరందరికీ వివిధ దేశాలు ఆశ్రయం కల్పిస్తున్నాయి. అందులో భారత్ కూడా ఒకటి(india refugee afghanistan).
అఫ్గానిస్థాన్‌కు సంప్రదాయ భాగస్వామ్య దేశమైన భారత్.. అక్కడి ప్రజలకు అనేక సార్లు ఆశ్రయం(afghan refugees in india) కల్పించింది. వీరే కాదు.. పాక్ నుంచి వచ్చిన మైనారిటీలైనా, టిబెట్ బౌద్ధులైనా, శ్రీలంక తమిళులైనా.. ఆశ్రయం కల్పించాలంటూ దేశంలోకి వచ్చిన సక్రమ వలసదారులెవరికీ వెన్నుచూపలేదు.
అయితే, వలసదారులకు సంబంధించి భారత్ నిర్దిష్ట విధానం(india refugee policy) అంటూ రూపొందించుకోలేదు. శరణార్థులపై ఐరాస రూపొందించిన 1951 యూఎన్ కన్వెన్షన్(1951 refugee convention), 1967 ప్రోటోకాల్‌పై భారత్ సంతకమూ చేయలేదు. దేశంలో శరణార్థుల కోసం ప్రత్యేక చట్టమంటూ ఏదీ లేదు కూడా. అయినప్పటికీ, అనేక మంది శరణార్థులకు భారత్ ఆశ్రయం కల్పిస్తోంది. అఫ్గాన్‌లోని భద్రత, భౌగోళిక రాజకీయ పరిస్థితులను బట్టి.. 1979 నుంచి అక్కడి ప్రజలకు ఆశ్రయం ఇవ్వడం ఆరంభించింది. ఈ నేపథ్యంలో ఓ నిర్దిష్ట పాలసీ అంటూ ఏర్పాటు చేసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
శరణార్థులకు ఆశ్రయం ఇలా..
శరణార్థుల విషయంలో ఓ విధానం రూపొందించాలన్న ప్రతిపాదనలు ఎప్పటి నుంచో దేశంలో వినిపిస్తున్నాయి. 2019లో పౌరసత్వ చట్టాన్ని(CAA india) సవరించిన సమయంలోనూ ఇలాంటి డిమాండ్లు వినిపించాయి. అఫ్గాన్ నుంచి వచ్చే హిందూ, సిక్కు శరణార్థులకు మాత్రమే పౌరసత్వం కల్పిస్తామని సవరణ చట్టంలో పేర్కొనడంపై తీవ్ర అభిప్రాయభేదాలు తలెత్తాయి. అయితే, దీనర్థం ఇతర మతాలకు సంబంధించినవారికి ఆశ్రయం కల్పించకుండా ఉండటం కాదని మాజీ దౌత్యవేత్త జితేంద్ర త్రిపాఠి పేర్కొన్నారు.
"పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి వచ్చిన మైనారిటీ హిందువులు, సిక్కులకు పౌరసత్వం కల్పిస్తామని సీఏఏలో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. దీనర్థం.. ఇతర మతాలకు చెందినవారికి దేశంలోకి అనుమతి లేదని కాదు. నిర్దిష్ట కేసును బట్టి.. వారికి దేశంలోకి అనుమతి ఉంటుంది. ప్రస్తుతం అది కొనసాగుతోంది. భారత్ చేపట్టిన తరలింపు ప్రక్రియలో అఫ్గాన్‌లోని హిందువులు మాత్రమే కాదు, ముస్లింలు కూడా భారత్‌కు వచ్చారు. అయితే, భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క శరణార్థిని పూర్తిగా తనిఖీ చేయాలి. శరణార్థుల పేరుతో ఉగ్రవాదులూ భారత్‌లోకి వచ్చినవారు ఉండొచ్చు. ఒక్కో కేసును నిశితంగా పరిశీలించి శరణార్థులను దేశంలోకి అనుమతించాలి."
-జితేంద్ర త్రిపాఠి, మాజీ దౌత్యవేత్త
అధికారం వారిదే!
ఎవరిని శరణార్థులుగా పరిగణించాలనే విషయాన్ని తేల్చే అధికారం వారికి ఆశ్రయమిచ్చే దేశాలదే. ఈ విషయంపై ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషన(UNHCR) దేశాలపై ఒత్తిడి చేయదు. రాజకీయ పరిస్థితుల ఆధారంగా దీనిపై దేశాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ఇటీవల భారత్‌కు వచ్చిన వారిలో అఫ్గానిస్థాన్ పార్లమెంట్ సభ్యులు, విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. వీరందరికీ ఇదివరకే భారత వీసాలు ఉన్నాయి.