ఇప్పటివరకూ వెలుగు చూడని ఒక కొత్త రకం నీలివర్ణపు తిమింగలాల(బ్లూ వేల్స్)ను పశ్చిమ హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ ప్రాంతం నుంచి వస్తున్న శబ్దాలను విశ్లేషించడం ద్వారా వారు ఈ ఆవిష్కారం చేశారు. ఈ భారీ మత్స్యాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన తీరు గురించి మరిన్ని వివరాలను వెలుగులోకి తీసుకురావొచ్చని భావిస్తున్నారు.
అమెరికాలోని 'న్యూ ఇంగ్లండ్ అక్వేరియం' శాస్త్రవేత్తలు ఈ ఆవిష్కారం చేశారు. భూమి మీదున్న జీవజాలంలో బ్లూవేల్స్ అతిపెద్దవి. అయితే అవి అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఈ జీవులు చాలా తక్కువ శ్రుతిలో రాగాలు ఆలపిస్తుంటాయి. స్థాయి తక్కువగా ఉన్నప్పటికీ వాటిని మనం వినొచ్చు.