తెలంగాణ

telangana

ETV Bharat / bharat

New Political Party: ఏపీలో కొత్త రాజకీయ పార్టీ.. తెలుగు భాషను కాపాడటమే లక్ష్యంగా 'జై తెలుగు'

New Party in AP: రాష్ట్రంలో మరో కొత్త పార్టీ వెలిసింది. ఎటువంటి హంగూ, ప్రకటనలు లేకుండా కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. తెలుగు భాషను పరిరక్షించడం కోసం ఈ పార్టీ ఆవిర్భవించింది. దీనిని సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు పార్టీని ప్రారంభించారు.

New Party in AP
New Party in AP

By

Published : Jun 20, 2023, 4:36 PM IST

Jai Telugu Party in AP: ఆంధ్రప్రదేశ్​లో ఓ కొత్త పార్టీ ఆవిర్భవించింది. ఎలాంటి హడావుడి లేకుండా.. కనీసం పార్టీ ఏర్పాటుపై ఒక చిన్న ప్రకటన కూడా లేకుండా నూతన పార్టీ ఆవిర్భవించింది. పార్టీ పేరు చూస్తే తెలుగుదేశం పార్టీ మాదిరిగానే ఉంది. ఆనాడు నందమూరి తారక రామారావు.. తెలుగు వాడి ఆత్మగౌరవం నినాదంతో టీడీపీని ప్రారంభిస్తే.. తాజాగా తెలుగు భాషా పరిరక్షణ కోసం అంటూ 'జై తెలుగు' పార్టీని కవి, ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ప్రారంభించారు. తెలుగు భాషా సంస్కృతి కోసం ప్రత్యేక రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలకు, రాజకీయ నాయకులకు సరైన అవగాహన కల్పించడమే తమ పార్టీ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. వారందరిని చైతన్యవంతులుగా తీర్చిదిద్దడానికే ఈ రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్​ బాగా నష్టపోయిందని.. తెలుగు భాషా, సంస్కృతి పూర్తిగా మరుగున పడిపోయిందన్నారు. వీటి కోసం రాజకీయ నాయకులు, ప్రజలు పని‌ చేయాలని ఆయన తెలిపారు. జై తెలుగు పేరుతో ఐదు రంగులు కలిగిన పార్టీ జెండాను కూడా రూపొందించినట్లు జొన్నవిత్తుల తెలిపారు. జెండాలో నీలం, పచ్చ, ఎరుపు, బంగారు వర్ణం, తెలుపు రంగులు ఉన్నాయి. అలాగే జెండా వెనుక రథం గుర్తు ఉంది. ఈ ఐదు రంగులు ఐదు విషయాలను తెలియజేస్తాయని స్పష్టం చేశారు. నీల వర్ణం జలవనరులు, ఆకుపచ్చ రంగు వ్యవసాయ అభివృద్ధి, అరుణ వర్ణం శ్రమశక్తి, పారిశ్రామిక అభివృద్ధి, బంగారు వర్ణం వ్యవసాయ వైభవం, తెలుపు వర్ణం సమాజంలో శాంతికి చిహ్నమని ఆయన తెలిపారు. రథానికి ఉన్న ప్రాముఖ్యతను కూడా ఆయన వివరించారు. వెనుక తెలుగు భాష రథాన్ని ప్రజలు లాగాలనేది తన ఆకాంక్ష అని ఆయన పేర్కొన్నారు. అలాగే తెలుగు భాష కోసం ఐదుగురు ‌మహనీయులు కృషి చేశారని.. త్యాగాలు చేశారని వెల్లడించారు. గిడుగు రామ్మూర్తి, కందుకూరి వీరేశలింగం పంతులు, పొట్టి శ్రీరాములు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఫొటోలు తమ జై తెలుగు రాజకీయ జెండాలో, అజెండాలో ఉంటాయని జొన్నవిత్తుల స్పష్టం చేశారు.

తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన వారు ఎందరో ఉన్నా.. వీరు మాత్రం ముందు వరుసలో ఉంటారని జొన్నవిత్తుల అన్నారు. తెలుగు భాషా సంస్కృతి, దాని వైభవం గురించి నేడు ఎవ్వరికీ తెలియని పరిస్థితి నెలకొందని ఆయన వివరించారు. మన భాషను మనమే విస్మరించి చులకన చేసుకున్నామని జొన్నవిత్తుల ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భాష మొత్తం ఒక్కటే అని.. ఆంధ్రప్రదేశ్​లో మాత్రం ప్రాంతాల వారీగా భాష మారిపోతుందన్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా-గుంటూరు, నెల్లూరు, రాయలసీమ ఐదు రకాల భాషలు రాష్ట్రానికి ఉన్నాయన్నారు. తెలుగు భాషకు వైభవాన్ని తీసుకురావాలనేదే తన ముఖ్య సంకల్పమన్నారు. లక్షల కోట్ల బడ్జెట్, అధికారం ఉన్న ప్రభుత్వాలు తెలుగు భాషకు సమున్నత స్థానం కల్పించాలని జొన్నవిత్తుల కోరారు. మాతృ భాష పరిరక్షణ .. రాజకీయ నాయకుల బాధ్యత అని స్పష్టం చేశారు. నూతన పార్టీ పెట్టడానికి ఇందులో ఏ పార్టీ ప్రమేయం లేదని.. తనకు అవసరం లేదని తేల్చిచెప్పారు. అలాగే ఆగస్టు 15 నాటికి తమ పార్టీ విధి విధానాలు ప్రకటిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగు భాషా పరిరక్షణ అజెండాతో పోటీ చేస్తామని జొన్నవిత్తుల ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details