New Parliament Open Today :భారత స్వాతంత్ర్య ప్రయాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. నూతన పార్లమెంట్‌లో కార్యకలపాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. పార్లమెంట్ పాత భవనంలోని సెంట్రల్ హాల్‌లో జరిగిన ఉద్విగ్న ప్రసంగం తర్వాత ఉభయసభల సభ్యుల కొత్త పార్లమెంట్‌కు పాదయాత్రగా వెళ్లారు. ప్రధాని మోదీ ముందు నడవగా కేంద్రమంత్రులు, ఎన్డీఏ కూటమిలోని మిగతా సభ్యులు ఆయన్ను అనుసరించారు.
'భారత్ మాతాకీ జై' అంటూ కొత్త పార్లమెంట్‌లోకి..
అనంతరం సభ్యులంతా 'భారత్ మాతాకీ జై' అంటూ నినదిస్తూ కొత్త భవనంలోకి అడుగుపెట్టారు. సెంట్రల్ హాల్‌లోని రాజ్యాంగ పుస్తకాన్ని నూతన భవనంలోకి తరలించారు. కాంగ్రెస్ నేతలు భారత రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగుపెట్టారు. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరీ రాజ్యాంగాన్ని చేతపట్టగా రాహుల్‌గాంధీ సహా మిగిలిన సభ్యులు నూతన పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు. అనంతరం జనగణమణ గీతంతో లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
Old Parliament Building Name : నూతన పార్లమెంట్‌లో తొలిసారిగా మాట్లాడిన స్పీకర్ ఓం బిర్లా.. ప్రజా సమస్యలపై చర్చించే సమయంలో కొత్త ఒరవడిని సృష్టించాలని సభ్యులకు పిలుపునిచ్చారు. వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పిన స్పీకర్.. కొత్త పార్లమెంట్‌లోకి మారడం చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులకు, రాజ్యాంగ నిర్మాతలకు నివాళులు అర్పించారు. ఇక నుంచి పార్లమెంట్ పాత భవనాన్ని సంవిధాన్ సదన్‌గా పిలువనున్నట్లు వెల్లడించారు స్పీకర్ ఓం బిర్లా. సభలో ఉపయోగించే పదాలైన.. హౌజ్, లాబీ, గ్యాలరీలను.. కొత్త పార్లమెంట్‌గా వ్యవహరించాలని చెప్పారు. అంతకుముందు పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ.. పాత భవనాన్ని సంవిధాన్ సదన్‌గా పిలుచుకుందామని సలహా ఇచ్చారు. రాజ్యాంగకర్తల స్ఫూర్తిని భావితరాలకు అందిద్దామని తెలిపారు.