తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభానికి రెడీ.. ముహూర్తం ఎప్పుడంటే? - కొత్త పార్లమెంట్ ఎప్పుడు ప్రారంభం

పార్లమెంట్ నూతన భవనాన్ని మే నెల చివర్లో ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ప్రారంభోత్సవం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని ఈటీవీ భారత్​కు వివరించారు.

new-parliament-building-inauguration-date
new-parliament-building-inauguration-date

By

Published : May 1, 2023, 10:12 PM IST

Updated : May 1, 2023, 10:44 PM IST

నూతన పార్లమెంట్ భవనం ప్రారంభానికి ముహూర్తం సిద్ధమైంది. పార్లమెంట్ భవనాన్ని మే చివర్లో ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రజా పనుల విభాగం (సీపీడబ్ల్యూడీ) వర్గాలు ఈ విషయాన్ని ఈటీవీ భారత్​కు వెల్లడించాయి. ప్రారంభోత్సవం కోసం ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పుష్పాల అలంకరణ సహా ఇతర డెకరేషన్ పనుల కోసం రూ.14 లక్షలకు టెండర్లు సైతం పిలిచినట్లు వివరించాయి. ప్రారంభోత్సవానికి సంబంధించి అధికారిక తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు స్పష్టం చేశాయి.

"పార్లమెంట్ కొత్త భవనం నిర్మాణం దాదాపు పూర్తైంది. నిర్మాణ అనంతర పరిశీలన పెండింగ్​లో ఉంది. కేంద్ర గృహ, పట్టణ శాఖ కార్యదర్శి మనోజ్ జోషి, సీపీడబ్ల్యూడీ డీజీ శైలేంద్ర శర్మ పనుల పురోగతిని పరిశీలిస్తున్నారు. అలంకరణ బిడ్డింగ్ గెలుచుకున్న వారు.. తేదీ ప్రకటించిన మూడు రోజుల్లోగా ఏర్పాట్లు పూర్తి చేయాలి. నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఇతర ప్రముఖులు సైతం ఈ కార్యక్రమానికి హాజరవుతారు" అని అధికార వర్గాలు వెల్లడించాయి.

పార్లమెంట్ కొత్త భవనంలో లోక్​సభ

సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రపతి భవన్ నుంచి రాజ్​పథ్ మధ్య ఉన్న మూడు కిలోమీటర్ల స్థలంలో కేంద్ర ప్రభుత్వ భవనాలు నిర్మిస్తున్నారు. సెంట్రల్ సెక్రెటేరియట్, కొత్త కార్యాలయాలు, ప్రధాని నివాసం, ఉపరాష్ట్రపతి ఎన్​క్లేవ్​లను సిద్ధం చేస్తున్నారు. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖకు చెందిన కేంద్ర ప్రజా పనుల శాఖ ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి.

పార్లమెంట్ కొత్త భవనం నమూనా చిత్రం

కొత్త పార్లమెంట్ నిర్మాణ పనులు రెండేళ్ల క్రితం ప్రారంభమయ్యాయి. 2020 డిసెంబర్​లో భవనానికి పునాది రాయి వేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నిజానికి గతేడాది నవంబర్​లోనే భవనం పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ, పలు కారణాల వల్ల నిర్మాణం ఆలస్యమైంది. పార్లమెంట్ భవనం ప్రారంభించే తేదీపై తుది నిర్ణయం ప్రభుత్వానిదేనని గతేడాది నవంబర్​లో హర్దీప్ సింగ్ పురీ వెల్లడించారు.

64,500 చదరపు మీటర్ల పరిధిలో కొత్త పార్లమెంట్ భవనం ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్​తో పాటు రెండు అంతస్తులు ఉంటాయి. ప్రస్తుత భవనాన్ని పోలినట్లు ఉండే కొత్త పార్లమెంట్ ఎత్తు సైతం పాత భవనం అంతే ఉంటుంది. ఒకేసారి 1224 మంది ఎంపీలు కూర్చోవడానికి వీలుగా పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. లోక్​సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేందుకు అనుగుణంగా ఏర్పాట్లు ఉండనున్నాయి. ప్రత్యేక రాజ్యాంగ మందిరం, సభాపతులు, మంత్రులకు ప్రత్యేక ఆఫీసులు ఉంటాయి. ఎంపీల కోసం విశాలమైన లాంజ్, లైబ్రరీ, కమిటీల గదులు, క్యాంటీన్లు ఉండనున్నాయి.

Last Updated : May 1, 2023, 10:44 PM IST

ABOUT THE AUTHOR

...view details