అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతూ దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నారు పలువురు భారతీయులు. ఉత్తరాఖండ్, రూర్కీకి చెందిన డాక్టర్ తారిక్ అఫ్రోజ్.. అల్జీమర్స్, ఎఫ్టీడీ, ఏఎల్ఎస్ వంటి నయం చేయలేని వ్యాధులకు సరికొత్త ఔషధాన్ని రూపొందించి భారత్ గర్వపడేలా చేశారు.
ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అమిట్రోఫిక్ లేటరల్ స్క్లేరోసిస్(ఏఎల్ఎస్) బారినపడి.. కుర్చీకే పరిమితమయ్యారు. ఈ వ్యాధితో శరీరం పక్షవాతానికి గురవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి లక్ష మందిలో 22 మందికి ఈ వ్యాధి ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అల్జీమర్స్, ఎఫ్టీడీ వ్యాధులు మనిషి మెదడును పూర్తిగా నాశనం చేస్తాయి. ఒక్క అమెరికాలోనే 50 లక్షల మంది అల్జీమర్స్ బాధితులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది ఎఫ్టీడీతో బాధపడుతున్నారు.
ఇప్పటి వరకు ఆ వ్యాధులకు చికిత్స లేదు. ఈ క్రమంలో డాక్టర్ తారిక్ అఫ్రోజ్.. ఆవిష్కరణలతో కీలక ముందడుగు పడింది. మందే లేదనుకున్న ఈ వ్యాధులను నయం చేసే ఔషధాన్ని రూపొందించారు తారిక్. 2020, నవంబర్లో తాను కనుగొన్న ఔషధానికి పేటెంట్ పొందారు. ప్రస్తుతం ఈ మందుపై స్విట్జర్లాండ్లో క్లినికల్ ప్రయోగాలు జరుగుతున్నాయి.