రెండు నిమిషాల్లోనే కరోనాను గుర్తించేలా చెన్నై కీజపక్కంలోని కేజే ఆస్పత్రి, పీజీ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు ఓ పరికరాన్ని అభివృద్ధి చేశారు. కేజే కొవిడ్ ట్రాకర్ పేరుతో డిజైన్ చేసిన ఈ పరికరం తయారీకి నానోసాంకేతికతను వినియోగించారు. చెయ్యి ఆకారంలో ఉండే ఈ పరికరాన్ని ఓ సెన్సార్, ల్యాప్‌టాప్‌కు అనుసంధానించి ఉపయోగించవచ్చు.
ఎలా వాడతారు?
ఎలాంటి శాంపిళ్లు అవసరం లేకుండానే ఈ పరీక్ష నిర్వహిస్తారు. కరోనా పరీక్ష చేసుకునే వ్యక్తి ఈ పరికరంలోని ట్రాకర్‌పై తన ఐదు చేతి వేళ్లను ఉంచాలి. రెండు నిమిషాల్లోనే ఆ వ్యక్తి రక్తపోటు, ఆక్సిజన్ స్థాయిలు, శరీర ఉష్ణోగ్రత, హిమోగ్లోబిన్, రక్త కణాల సంఖ్య వంటి వివరాలన్నీ తెలిసిపోతాయి. జీటా పొటెన్షియల్ స్థాయిలూ దీని ద్వారా పసిగట్టవచ్చు. దీని ఆధారంగా ఆ వ్యక్తికి కరోనా సోకిందా లేదా అన్న విషయాన్ని గుర్తించవచ్చు.
ఈ పరికరాన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులపై ప్రయోగించినట్లు కేజే ఆస్పత్రి, పీజీ రీసెర్చ్ సెంటర్ హెడ్ కేశవన్ జగదీశన్ తెలిపారు. అందులో వంద శాతం కచ్చితమైన ఫలితాలను రాబట్టినట్లు వెల్లడించారు.