కొవిడ్ టీకా ధ్రువపత్రంలో పేరు, పుట్టినతేదీ వంటి వివరాల్లో తప్పులొస్తే.. వాటిని సరిచేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వీలు కల్పించింది. కొవిడ్ వ్యాక్సిన్ ధ్రువపత్రంలో మార్పులు చేసుకునేలా వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసినట్లు కేంద్రం బుధవారం వెల్లడించింది. కొవిన్ నమోదు సమయంలో పేరు, పుట్టిన తేదీ, లింగం వంటి వివరాలను పొరపాటుగా తప్పుగా ఇస్తే ధ్రువపత్రంలో వాటిని సరిచేసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు ఆరోగ్య సేతు ట్విట్టర్ ఖాతా ద్వారా కేంద్రం ట్వీట్ చేసింది.
వ్యాక్సిన్ సర్టిఫికేట్లో మార్పులు చేసుకునేందుకు వీలుగా కొవిన్ పోర్టల్లో రైజ్ యాన్ ఇష్యూ అనే ఫీచర్‌ను యాడ్ చేసింది. అయితే.. యూజర్లు తమ టీకా ధ్రువపత్రాన్ని ఒకసారి మాత్రమే మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అప్‌డేట్ చేసిన సమాచారం తుది ధ్రువపత్రంపై కన్పిస్తుంది. దేశీయ, విదేశీ ప్రయాణాల సమయంలో ఈ టీకా ధ్రువపత్రాల అవసరం ఏర్పడుతోంది. ఫలితంగా తప్పులు సరిచేసుకునేందుకు కేంద్రం అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.