భారత నూతన త్రిదళాధిపతి (సీడీఎస్)గా బాధ్యతలు స్వీకరించిన జనరల్ అనిల్ చౌహాన్‌కు కేంద్రం జడ్ ప్లస్ భద్రత కల్పించింది. దిల్లీ పోలీసులు ఆయనకు భద్రత కల్పిస్తారని కేంద్ర హోంమంత్రిత్వశాఖ వెల్లడించింది. భారత అత్యున్నత సైనిక కమాండర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనిల్ చౌహాన్‌కు కేంద్ర హోంశాఖ ఆదేశాలతో భద్రత కల్పిస్తున్నట్టు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. తొలి త్రివిధ దళాధిపతిగా పనిచేసిన జనరల్ బిపిన్ రావత్ ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తొమ్మిది నెలల తరవాత కేంద్ర ప్రభుత్వం అనిల్ చౌహాన్‌ను దేశ రెండో సీడీఎస్‌గా నియమించింది.
త్రివిధ దళాల పోరాట సామర్థ్యానికి మరింతగా పదును పెట్టడంతో పాటు వనరుల సమర్థ వినియోగానికి ఉద్దేశించిన థియేటరైజేషన్ ప్రణాళిక అమలే లక్ష్యంగా తదుపరి సీడీఎస్ ఎంపిక కోసం తీవ్ర కసరత్తు చేసిన కేంద్రం.. కొత్త సీడీఎస్‌గా అనిల్ చౌహాన్‌ను ఇటీవల ఎంపిక చేసింది. భారత అత్యున్నత సైనిక కమాండర్‌గా ఆయన కొనసాగుతున్నారు. భారత ప్రభుత్వ సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగానూ విధులు నిర్వర్తిస్తున్నారు.