New CJs to Telugu States: తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా.. జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పేరును.. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. 2013లో.. జమ్మూకశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తిగా.. జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నియమితులయ్యారు. అక్కడ సుదీర్ఘకాలం సేవలందించిన ఆయన సీనియర్ జడ్జిగా గుర్తింపు పొందారు. 2022 జూన్‌లో బాంబే హైకోర్టుకు బదిలీపై వెళ్లారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9న మణిపుర్ హైకోర్టు సీజేగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఐతే.. జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ నియామకానికి.. కేంద్రం ఇంకా ఆమోదం తెలపలేదు. ఈ నేపథ్యంలో ఆయనను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పంపాలని.. తాజాగా కేంద్రానికి సిఫారసు చేసింది. కొలీజియం సిఫారసు.. నియామకాన్ని కేంద్రం ఆమోదించాల్సి ఉంది.
జస్టిస్ అలోక్ అరదే: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరదే పేరును కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. మధ్యప్రదేశ్‌కి చెందిన జస్టిస్ అలోక్ అరదే 2009లో న్యాయమూర్తిగా నియామకం కాగా.. 2018 నవంబర్ నుంచి కర్ణాటక హైకోర్టు జడ్జిగా కొనసాగుతున్నారు. కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఉజ్జన్ భూయాన్‌ని సుప్రీంకోర్టుకు కొలీజియం సిఫార్సు చేయడంతో రాష్ట్ర హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తిని సిఫార్సు చేసింది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా: తెలుగు రాష్ట్రాలతో సంబంధం ఉన్న ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కొలిజియం సిఫార్సు చేసింది. ఇందులో ప్రస్తుత తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ఎస్.వెంకటనారాయణ భట్ ఉన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ కిషన్‌కౌల్, జస్టిస్ సంజీవ్‌ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన కొలీజియం బుధవారం ఈమేరకు సిఫార్సు చేసింది.
జస్టిస్ ఉజ్జల్ భూయాన్:జస్టిస్ ఉజ్జల్ భూయాన్ 2011 అక్టోబర్ 17న గువాహటి హైకోర్టు జడ్జ్‌గా నియమితులయ్యారు. ఆ హైకోర్టు నేపథ్యం ఉన్న న్యాయమూర్తుల్లో అత్యంత సీనియర్‌గా ఆయన ఉన్నారు. 2022 జూన్ 28 నుంచి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్నారు. హైకోర్టు న్యాయమూర్తిగా సుదీర్ఘకాలం సేవలు అందించిన జస్టిస్ భూయాన్ న్యాయరంగానికి సంబంధించిన విభిన్న అంశాలపై విశేష అనుభవం సంపాదించారు.
జస్టిస్ వెంకటనారాయణ భట్: జస్టిస్ వెంకటనారాయణ భట్ 2013 ఏప్రిల్ 12న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ హైకోర్టు నేపథ్యం ఉన్న వారిలో ఆయన అత్యంత సీనియర్ న్యాయమూర్తి. 2022 ఆగస్టు నుంచి (జస్టిస్ ఎన్పీ రమణ పదవీ విరమణ అనంతరం) ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సుప్రీంకోర్టులో ప్రాతినిధ్యం లేదు. 2019లో మార్చిలో జస్టిస్ భట్ కేరళ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2023 జూన్ 1 నుంచి ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తూ వస్తున్నారు.