ఈశాన్య భారతంలో రానున్న రోజుల్లో క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య భారీగా పెరగనుంది. 2025 నాటికి 57,131 కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్), బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ రీసెర్చ్(ఎన్సీడీఐఆర్) సంస్థలు విడుదల చేసిన ఓ నివేదిక తెలిపింది. ప్రపంచ క్యాన్సర్ దినం సందర్భంగా గురువారం ఈ వివరాలను వెల్లడించాయి. 2020లో క్యాన్సర్ కేసుల సంఖ్య అక్కడ 50,317గా ఉన్నట్లు ఐసీఎంఆర్ అంచనా వేసింది.
11 జనాభా ఆధారిత క్యాన్సర్ రిజిస్ట్రీస్(పీసీబీసీఆర్), 7 ఆసుపత్రి ఆధారిత క్యాన్సర్ రిజిస్ట్రీస్(హెచ్బీసీఆర్)ల సమాచారం ఆధారంగా ఈ నివేదికను పొందుపర్చామని ఐసీఎంఆర్ తెలిపింది. ఆరోగ్య రంగంలో భవిష్యత్లో తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయాలకు ఈ నివేదిక.. మార్గదర్శకత్వం కానుందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ పేర్కొన్నారు.