భారత ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు ఐక్యరాజ్య సమితి డిక్లరేషన్‌కు వ్యతిరేకంగా ఉన్నాయని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే రైతులు, ఇతర ప్రజల హక్కులను కాపాడేందుకు చేసిన ఈ తీర్మానంపై భారత్ సంతకం చేసిందని వెల్లడించింది. ఈ మేరకు ఐరాస మానవ హక్కుల మండలి 46వ భేటీకి ఎస్కేఎం నేత దర్శన్ పాల్ వీడియో సందేశాన్ని పంపారని తెలిపింది.
మోదీకి మెమొరాండం
దిల్లీ సరిహద్దులో రైతుల ఉద్యమం ప్రారంభమై 110 రోజులు అయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి రాసిన మెమొరాండంను అధికారులకు అందజేసినట్లు ఎస్కేఎం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను అందులో తీవ్రంగా వ్యతిరేకించింది. వ్యవసాయాన్ని కార్పొరేట్ పరం చేయడం ఆపాలని, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేసింది.
దిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలకు 110 రోజులు పూర్తైన నేపథ్యంలో.. మంగళవారం 'ప్రైవేటీకరణ-కార్పొరేటీకరణ వ్యతిరేక దినం'గా పాటిస్తున్నట్లు తెలిపింది సంయుక్త కిసాన్ మోర్చా. రైల్వే స్టేషన్ల వద్ద ట్రేడ్ యూనియన్ కార్యకర్తలు ధర్నాల్లో పాల్గొంటున్నారని వెల్లడించింది.
ఇదీ చదవండి:'అన్నాడీఎంకే మా మేనిఫెస్టోను కాపీ కొట్టింది'