Netaji death mystery : నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను భారత్‌కు తీసుకువచ్చే సమయం ఆసన్నమైందని ఆయన కుమార్తె అనితా బోస్ పేర్కొన్నారు. 1945, ఆగస్టు 18న ఆయన మరణించగా.. మృతిపై ఇప్పటికీ కొందరికి ఉన్న అనుమానాలకు డీఎన్‌ఏ పరీక్ష సమాధానాలు ఇస్తుందన్నారు. ప్రస్తుతం జపాన్ రాజధాని టోక్యోలోని రెంకోజీ ఆలయంలో ఉంచిన నేతాజీ అస్థికలకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించేందుకూ జపాన్ ప్రభుత్వం అంగీకరించిన విషయాన్ని అనితా బోస్ గుర్తుచేశారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని భారత్ ఘనంగా జరుపుకుంటోన్న వేళ.. నేతాజీ కుమార్తె అనితా బోస్ ఈ ప్రకటన చేశారు.
'అస్థికల నుంచి డీఎన్‌ఏ నమూనాలను సేకరించి.. అధునాతన సాంకేతికతతో వాటిని విశ్లేషించవచ్చు. 1945 ఆగస్టులో నేతాజీ చనిపోయారని చెబుతున్నా.. వాటిపై కొందరికి అనుమానాలు ఉన్నాయి. రెంకోజీ ఆలయంలో ఉన్న నమూనాలకు డీఎన్‌ఏ పరీక్ష చేయడంవల్ల వారి అనుమానాలను శాస్త్రీయంగా నివృత్తి చేసే వీలు కలుగుతుంది' అని అనితా బోస్ పేర్కొన్నారు. అటువంటి పరీక్షకు రెంకోజీ ఆలయ పూజారితోపాటు జపాన్ ప్రభుత్వం కూడా అంగీకరించిందన్నారు. నేతాజీకి భారత స్వాతంత్ర్యం కంటే ఏమీ ఎక్కువ కాదన్న ఆమె.. స్వాతంత్య్ర ఫలాలను భారత్ అనుభవిస్తోన్న వేళ వాటిని చూసేందుకు నేతాజీ బతికిలేరన్నారు. ఇటువంటి సమయంలోనైనా కనీసం ఆయన అస్థికలను భారత గడ్డకు తీసుకుచ్చేందుకు కృషి చేద్దామని.. అందుకు ఇదే సరైన సమయమని అనితా బోస్ పిలుపునిచ్చారు.