Nepal People Gifts To Ayodhya Sri Ram : అయోధ్యలో అడుగుపెట్టనున్న రామయ్యకు దేశవ్యాప్తంగా భక్తులు లెక్కలేనన్ని కానుకలు సమర్పించుకుంటున్నారు. అయితే తన అత్తగారి రాజ్యం నుంచీ రామచంద్రునికి అందమైన కానుకలు అందాయి. సీతాదేవి జన్మించిన నేపాల్‌లోని సుమారు 800 మంది భక్తులు అయోధ్యకు 500 కానుక డబ్బాలతో తరలివచ్చారు. వారితోపాటు జానకిమాత జన్మించిన జనక్‌పుర్ ఆలయ పూజారి కూడా తరలివచ్చారు.
"500 ఏళ్ల నాటి ఈ వివాదం చాలా కాలం తర్వాత సద్దుమణిగింది. జనవరి 22న ప్రాణ ప్రతిష్ట జరగుతున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఈ బంధం త్రేతాయుగానికి చెందినది. అప్పుడు రాముడికి, సీతమ్మకు స్వయంవర వివాహం జరిగింది. ఆ బంధం ఉంది కాబట్టే మేము ఇప్పుడు రాముడు ఇంటి ఏర్పాటుకు అవసరమైన వస్తువులను తీసుకొచ్చాం"
--రోషన్‌దాస్, జానక్‌పుర్ ఆలయ పూజారి
భక్తులు తీసుకొచ్చిన వాటిలో బంగారు, వెండి ఆభరణాలతో పాటు మిఠాయిలు, పండ్లు, డ్రైఫ్రూట్స్ కూడా ఉన్నాయి. అంతేకాక శ్రీరాముడి కోసం వెండి పాదరక్షలు, విల్లు, బాణం, కంఠహారాలు, గృహోపకరణాలు, పట్టు వస్త్రాల వంటి వస్తువులను భక్తులు బహుమతులుగా సమర్పించుకున్నారు.
త్రేతాయుగంలో సీతారాముల కల్యాణం సందర్భంగా జనకుడు నూతన వధూవరులకు ఎన్నో కానుకలు ఇచ్చాడని నేపాలీలు తెలిపారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తాము ఇప్పుడు ఈ కానుకలను తీసుకొచ్చామన్నారు. వీటితో రాముడు కొత్త ఇంటిని అలంకరించుకుంటారని చెప్పారు. కాగా నేపాల్ భక్తులు తీసుకొచ్చిన కానుకలను రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు అప్పగించారు.