భర్తపై కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన మహిళ.. సుమారు ఆరు నెలల తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో చెట్టుకు అస్థిపంజరంగా వేలాడుతూ కనిపించింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. ఆమెను నేపాల్‌కు చెందిన పుష్పా ధామిగా గుర్తించారు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది.
పోలీసుల వివరాలు ఇలా..
"శుక్రవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో హుళిమావు పోలీస్‌స్టేషన్ పరిధిలోని అపార్ట్మెంట్ వెనుక చెట్టుకు అస్థిపంజరం వేలాడుతున్నట్లు సమాచారం అందింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నాం. అక్కడ పాత చెప్పులు, నెక్లెస్, మరికొన్ని వస్తువులు దొరికాయి. అక్కడ లభించిన వస్తువులను ఫోరెనిక్స్ సైన్స్ ల్యాబ్‌కు పంపించాం. ఆ తర్వాత గత ఏడాదిలో నమోదైన మిస్సింగ్ కేసులు పరిశీలించాం. అప్పుడు జులై 8న నేపాల్‌కు చెందిన ఓ మహిళ అదృశ్యమైనట్లు వచ్చిన ఫిర్యాదును గుర్తించాం. నేపాల్‌కు చెందిన పుష్ప ధామి ఆరు నెలల క్రితం అదృశ్యమైంది. చిన్న విషయమై భర్తతో గొడవ జరగడం వల్ల ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత భార్య అదృశ్యంపై ఆమె భర్త ఫిర్యాదు చేశాడు. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. ఫిర్యాదు చేసే సమయంలో అతడు ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించగా దొరికిన అస్థిపంజరం పుష్ప ధామిదేనని, ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని తేలింది" అని డీసీపీ తెలిపారు.
4ఏళ్ల బాలికపై ఇంటి యజమాని కొడుకు అత్యాచారం..
బిహార్‌లోని రోహతాస్‌లో దారుణం జరిగింది. ఎవరూ లేని సమయంలో నాలుగేళ్ల బాలికపై ఇంటి యజమాని కుమారుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి అరుపులు విన్న స్థానికులు.. ఘటనాస్థలికి వెళ్లి నిందితుడిని పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించారు.