భారత్‌లోకి నేపాలీల చొరబాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఆధార్ కార్డును ఉపయోగించుకొని భారత్‌లోకి ప్రవేశిస్తున్నారు నేపాల్ వాసులు. బంబాస సరిహద్దు నుంచి వీరు దేశంలోకి వస్తున్నారు. నేపాల్‌కు చెందిన ఓ మహిళ ఆధార్ కార్డు చూపిస్తూ భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన వీడియోతో ఈ చొరబాట్ల విషయం బయటపడింది.
కరోనా నేపథ్యంలో ఇరుదేశాల సరిహద్దులను అధికారులు మూసేశారు. ఆధార్ కార్డు ఉన్న వ్యక్తులను మాత్రమే దేశంలోకి అనుమతిస్తున్నారు. నేపాల్ వాసులైతే అక్కడి జిల్లా మేజిస్ట్రేట్ నుంచి అనుమతి పత్రం ఉంటేనే రానిస్తున్నారు. అది కూడా భారత్‌లో వైద్యం కోసమే వీరికి అనుమతులు మంజూరు చేస్తున్నారు.
నేపాలీ మహిళల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. తనతో పాటు మరో మహిళ కూడా భారత్‌లోకి ప్రవేశించింది. రెండో మహిళ దగ్గర ఎలాంటి గుర్తింపు పత్రం లేకపోవడం గమనార్హం. కస్టమ్స్ అధికారుల అనుమతి తీసుకొనే వచ్చామని అధికారులతో చెప్పడం వీడియోలో నమోదైంది.
అయితే అనుమతి పత్రం లేకుండా దేశంలోకి వచ్చేందుకు మహిళకు అనుమతించడంపై వివాదం చెలరేగింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ విషయంపై కన్నెర్రజేసింది. కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.