కాలాపానీ వివాదం నేపథ్యంలో భారత్-నేపాల్ మధ్య సంబంధాలు కాస్త దెబ్బతిన్నాయి. ఆ తర్వాత వివాదం సద్దమణిగి.. ఇరు దేశాలు మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో.. మరో షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది. నేపాల్ నుంచి భారత్ స్నేహాన్ని కోరుకుంటుంటే.. ఆ దేశం మాత్రం ఉత్తరాఖండ్ సరిహద్దులోని ఇండియా భూభాగంపై కన్నేసినట్లు ఆ రాష్ట్ర అటవీశాఖ చెబుతోంది. గత 12 సంవత్సరాలుగా ఉత్తరాఖండ్ సరిహద్దులోని భారతదేశ భూమిని నేపాల్ ఆక్రమిస్తున్నట్లు ఆ రాష్ట్ర అటవీ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది.
చంపావత్‌లోని సరిహద్దు ప్రాంతంలో ఇప్పటివరకు అటవీశాఖకు చెందిన 5 హెక్టార్ల భారత భూమిని నేపాల్ ఆక్రమించినట్లు ఉత్తరాఖండ్ అటవీశాఖ వెల్లడించింది. వాస్తవానికి ఈ విషయమై భారత ప్రభుత్వానికి నేపాల్, భూటాన్ సరిహద్దులో మోహరించిన భారతదేశ సరిహద్దు రక్షణ దళం సశాస్త్ర సీమా బాల్( ఎస్ఎస్బీ) నివేదించింది. తాజాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి.. ఆ రాష్ట్ర అటవీ శాఖ రాష్ట్ర నివేదిక అందజేసింది.