తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నెహ్రూ మ్యూజియం పేరు మార్పు .. ప్రతీకార రాజకీయాలంటూ కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్​ - నెహ్రూ మ్యూజియం పేరు మార్చిన బీజేపీ

Nehru Museum Name Change : కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం పట్ల కాంగ్రెస్ భగ్గుమంది. నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీ సొసైటీ పేరును.. మోదీ ప్రభుత్వం మార్చడం వల్ల కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై మండిపడింది.

Nehru Museum Name Changed
నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం పేరు మార్పు

By

Published : Jun 16, 2023, 10:06 PM IST

Nehru Museum Name Change : భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ అధికారిక నివాసం తీన్‌మూర్తి భవన్‌లో ఉన్న నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీ సొసైటీ పేరును.. ప్రధానమంత్రుల మ్యూజియంగా మారుస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మ్యూజియం పేరును మార్చాలని నిర్ణయించినట్లు సాంస్కృతిక శాఖ వెల్లడించింది.

"భారత మొదటి ప్రధాని జవహార్‌లాల్‌ నెహ్రూ నుంచి నేటి నరేంద్ర మోదీ వరకు ఎంతో మంది ప్రధానమంత్రులు దేశానికి చేసిన సేవలు, వారు ఎదుర్కొన్న సవాళ్లకు సంబంధించి అన్ని విషయాలను ఈ మ్యూజియం తెలియజేస్తుంది. అందుకే దీని పేరును మారుస్తూ చేసిన ప్రతిపాదన స్వాగతించదగినది. ప్రధానులందరి ప్రయాణం ఒక ఇంద్రధనస్సు వంటింది. అది అందంగా ఉండాలంటే ఇంద్రధనస్సులోని రంగులన్నీ సమపాళ్లలో ఉండాలి."
- రాజ్‌నాథ్‌ సింగ్‌ , రక్షణశాఖ మంత్రి.

మండిపడ్డ కాంగ్రెస్‌..
అయితే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఇది వారి చెడు బుద్ధి, నియంతృత్వ ధోరణిని తెలియజేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. బీజేపీని విమర్శించారు. ఏ చరిత్ర లేనివారే ఇతరుల చరిత్రను చెరిపివేస్తారని ఆయన అన్నారు. 59 ఏళ్లకు పైగా అంతర్జాతీయ మేధో భాండాగారంగా విరాజిల్లుతూ.. ఎన్నో పుస్తకాలకు నిలయంగా ఉన్న ఈ మ్యూజియం పేరు మార్చడం తగదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. సంకుచిత మనస్తత్వం, ప్రతీకార రాజకీయాలకు మోదీ మారుపేరుగా నిలుస్తున్నారని మండిపడ్డారు. అభద్రతాభావంతో ఉండే ఓ అల్పవ్యక్తి విశ్వగురువు అని ప్రచారం చేసుకుంటున్నారని ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్​పై నడ్డా మాటల తూటాలు..
ప్రధానమంత్రుల మ్యూజియంలో ప్రతి ప్రధానికి గౌరవం ఉందని, తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు సంబంధించిన విభాగంలో ఎలాంటి మార్పులు చేయలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తెలిపారు. ప్రధానమంత్రుల మ్యూజియం అనేది రాజకీయాలకు అతీతమైన ప్రయత్నమని.. కాంగ్రెస్‌కు దీనిని గ్రహించే ఆలోచన శక్తి లేదని నడ్డా ఆరోపించారు. భారతదేశానికి ఎందరో నాయకులు సేవ చేశారన్న వాస్తవాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా జీర్ణించుకోలేకపోతోందని నడ్డా ట్వీట్ చేశారు.

సావర్కర్​, హెగ్డేవార్​ల చరిత్ర తొలగింపుపై ఫడణవీస్ ఫైర్..
కర్ణాటక ప్రభుత్వం పాఠ్య పుస్తకాల నుంచి వీర్​ సావర్కర్​, హెగ్డేవార్​ల చాప్టర్​లను తొలగించడంపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ మండిపడ్డారు. ఈ వ్యవహారంపై స్పందించాల్సిందిగా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేను ఆయన డిమాండ్ చేశారు. కేవలం మైనర్టీ వర్గాలను సంతృప్తి పరిచేందుకే కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఫడణవీస్ ఆరోపించారు. 'కర్ణాటక ప్రభుత్వం పాఠ్యాంశాల్లోంచి వీర్​ సావర్కర్​, హెగ్డేవార్​ల చరిత్రను తొలగించవచ్చు. కానీ ప్రజల గుండెల్లోంచి వారి స్థానాన్ని చెరిపివేయలేరు. మహారాష్ట్రలో ప్రతిపక్షంలో కాంగ్రెస్ కూటమితో కలిసి ఉన్న శివసేన ఈ విషయంపై తమ వైఖరిని తెలియజేయాలి. అధికారం కోసం ఉద్ధవ్ రాజీపడుతున్నారు' అని ఫడణవీస్ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details