నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా వివిధ మార్గాల్లో నిరసన తెలుపుతున్న రైతు సంఘాలు గురువారం రైల్‌రోకో నిర్వహించాయి. దిల్లీ చుట్టుపక్కల రైతుల ఆందోళన కొనసాగుతుండగా.. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుతో దేశవ్యాప్తంగా రైల్‌రోకో నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఈ నిరసన సాయంత్రం నాలుగు గంటల వరకు సాగింది.
రైల్‌రోకోను శాంతియుతంగా నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు ఇవ్వగా, రైతులు దాన్ని అనుసరించి ఆందోళనలను ప్రశాంతంగా కొనసాగించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో పట్టాలపై బైఠాయించి నిరసన తెలుపుతున్న రైతులు ఉత్తర్‌ప్రదేశ్‌లో రైల్రోకో హరియాణాలోని అంబాలాలో రైల్‌రోకోలో పాల్గొన్న రైతులు పట్టాలపై బైఠాయించి..
రైల్‌రోకోలో భాగంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో రైతులు పట్టాలపై భారీ సంఖ్యలో బైఠాయించారు. రైళ్ల రాకపోకలు అడ్డుకున్నారు. రైతు ఆందోళనల్లో పంజాబ్, హరియాణా అన్నదాతలు కీలక పాత్ర పోషిస్తుండగా, ఆయా రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో రైల్రోకో జరిగింది. పంజాబ్‌లోని అమృత్‌సర్, లూథియానా, ఫతేనగర్ సాహిబ్, అంబాలా, హరియాణాలోని పలు ప్రాంతాల్లో రైతులు పిల్లాపాపలతో సహా ఆందోళనల్లో పాల్గొన్నారు. పట్టాలను ముట్టడించి సాగు చట్టాలను రద్దు చేయాలని నినదించారు.
రైల్రోకో నేపథ్యంలో హరియాణాలో మోహరించిన భద్రతా దళాలు పలు చోట్ల అరెస్టులు..
పంజాబ్, హరియాణా సహా దేశంలోని పలు ఇతర రాష్ట్రాల్లో కూడా రైతులు రైల్‌రోకో నిర్వహించారు. బంగాల్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, బిహార్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలోనూ రైతులు రైల్‌రోకో కార్యక్రమంలో పాల్గొన్నారు. బెంగళూరులోని యశ్వంత్‌పుర్ రైల్వే స్టేషన్‌లోకి రైతులు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కలబుర్గిలో రైల్వే స్టేషన్ వద్ద బైఠాయించిన రైతు నేతలను అరెస్టు చేశారు.
జమ్ముకశ్మీర్‌లో రైల్‌రోకోలో పాల్గొన్న నిరసనకారుడు ప్రభావం అంతంత మాత్రంగానే..
రైల్ రోకో నేపథ్యంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల రైల్ రోకోలో పాల్గొన్న రైతులు.. ప్రయాణికులకు ఆహారం, నీరు అందజేశారు. రైల్ రోకో నేపథ్యంలో ఉత్తరజోన్‌లో గురువారం 25 రైళ్ల సమయాన్ని మార్చారు. ఉత్తర భారతంలో కొన్ని రైళ్లు ఆలస్యంగా నడిచినప్పటికీ.. రైళ్ల రాకపోకలపై పెద్దగా ప్రభావం పడలేదని రైల్వే శాఖ ప్రకటించింది.
బంగాల్లో రైలు రాకపోకలు నిలిచిపోగా ప్రయాణికుల ఎదురుచూపులు భద్రత కట్టుదిట్టం..
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు జనవరి 26న ఎర్రకోట వద్ద చేపట్టిన ఆందోళనలో హింస జరిగిన నేపథ్యంలో.. రైల్‌రోకోకు దేశవ్యాప్తంగా పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. రైల్వే శాఖ 20 వేల మంది రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్‌ను రంగంలోకి దించింది. పంజాబ్, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్ , బంగాల్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచారు. శాంతిభద్రతల పర్యవేక్షణకు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు.
ఉత్తరాఖండ్‌లో రైల్‌రోకోతో నిర్మానుష్యంగా మారిన రైల్వేస్టేషన్ పరిసరాలు ఉత్తరాఖండ్‌లో పట్టాలపైనే నిలిచిపోయిన రైళ్లు ఇదీ చదవండి:టూల్‌కిట్ దర్యాప్తుపై దిల్లీ కోర్టుకు దిశ రవి