NEET Supreme Court: నీట్- పీజీ, యూజీ సీట్లకు రిజర్వేషన్లలో కేంద్రం నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ రిజర్వేషన్.. ప్రతిభకు విరుద్ధం కాదంది. అఖిల భారత కోటా సీట్లలో ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్‌కు 10శాతం కోటా కల్పించడం రాజ్యాంగ బద్ధమేనని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎ.ఎస్.బోపన్నల ధర్మాసనం గురువారం పేర్కొంది. కొన్ని తరగతులు పొందే ఆర్థిక- సామాజిక ప్రయోజనాన్ని పోటీ పరీక్ష ప్రతిబింబించదని స్పష్టం చేసింది. ఇలాంటి వ్యవహారాల్లో రిజర్వేషన్లు ఇచ్చేముందు ఇకపై సుప్రీంకోర్టు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. ప్రస్తుత రిజర్వేషన్ల ప్రకారం నీట్ పీజీ ప్రవేశాలు నిర్వహించేందుకు అనుమతించింది. "పనితీరుకు సంబంధించిన సంకుచిత నిర్వచనాలతో ప్రతిభను కుదించలేరు. ఇప్పటికీ కరోనా మన మధ్య ఉంది. వైద్యుల్ని నియమించడంలో ఎంతమాత్రం ఆలస్యమైనా పరిస్థితిని ఎదుర్కోవడంపై అది ప్రభావం చూపిస్తుంది. ఎలాంటి జాప్యం లేకుండా అడ్మిషన్ల ప్రక్రియను, కౌన్సిలింగ్‌ను అనుమతించాల్సి ఉంది.
ఈడబ్ల్యూఎస్ ప్రాతిపదికను పిటిషనర్లు సవాల్ చేశారు. దీనిపై సవివరంగా అన్ని పక్షాల వాదనల్ని వినాలి. అయితే పిటిషన్ పెండింగులో ఉండడం వల్ల కౌన్సిలింగ్ ప్రక్రియలో చోటు చేసుకున్న జాప్యం దృష్ట్యా ఆ ప్రక్రియను ప్రారంభించడానికి అనుమతించాలని మేం భావిస్తున్నాం. నిబంధనలు ఏకపక్షమని న్యాయస్థానం భావిస్తే తప్ప మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం. అందువల్ల 2021-22 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పించడానికి అనుమతిస్తున్నాం" అని పేర్కొంది.
కోటాతో అవకాశాలు లభిస్తాయి
"బహిరంగ పరీక్షల ద్వారా అభ్యర్థులందరికీ పోటీలో సమాన అవకాశాలు లభిస్తే, ఆ అవకాశాలు వెనుకబడిన తరగతులూ పొందేందుకు రిజర్వేషన్లు వీలు కల్పిస్తాయి. సాధారణంగా వ్యవస్థీకృత అడ్డంకుల వల్ల వారికి కొన్ని అవకాశాలు అందవు. హక్కులు, అవకాశాలకు దూరమైనవారికి సమాన అవకాశాలు కల్పించడానికి రిజర్వేషన్లే మార్గం. రిజర్వేషన్ అనేది ప్రతిభకు అడ్డంకి కాదు. అది ప్రభావశీల పంపిణీని ప్రోత్సహిస్తుంది. విద్యారంగంలో ఉన్న సదుపాయాలు పొందడంలో ఉన్న అసమానతల వల్ల కొన్ని వర్గాల ప్రజలు ఇతరులతో సమర్థంగా పోటీ పడలేరు. రిజర్వేషన్లు వంటి ప్రత్యేక అవకాశాలు కల్పించడం ద్వారా అలాంటివారు ఆ అడ్డంకుల్ని అధిగమించి, ఇతర వర్గాలతో సమానంగా పోరాడడానికి వీలుంటుంది. అభివృద్ధి చెందిన వర్గాలవారికి నాణ్యమైన పాఠశాల విద్య, కోచింగ్ కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. కుటుంబాల నేపథ్యం వారికి కలిసివస్తుంది. పోటీ పరీక్షలకు వారు అన్ని విధాలా బాగా సిద్ధం కాగలరు. ఇలాంటి అవకాశం లేని వర్గాలవారు వీరితో పోటీ పడలేక నష్టపోతారు. వారు చాలా అదనపు కృషి చేయాల్సి ఉంటుంది. ఉన్నత విద్య పొందడానికి కష్టపడి కృషి చేయవద్దని చెప్పడం మా ఉద్దేశం కాదు. ప్రతిభ అనేది కేవలం ఒకరి స్వయంకృషి మాత్రమే కాదని అర్థం చేసుకోవాలి. చుట్టుపక్కల వాతావరణమూ దానికి దోహదపడుతుంది. వ్యక్తి ప్రతిభకు మార్కులు ఒక్కటే అన్నివేళల్లో కొలమానం కాకపోవచ్చు" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఈడబ్ల్యూఎస్ కోటాకు ప్రాతిపదికను నిర్ణయించడానికి ఎంచుకున్న ప్రాతిపదిక చెల్లుబాటును మార్చిలో వివరంగా పరిశీలిస్తామని ప్రకటించింది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇవీ చూడండి:నీట్-పీజీ ప్రవేశాలకు సుప్రీంకోర్టు అనుమతి