NEET PG Counselling new date: వైద్య విద్య పీజీ ప్రవేశాలకు సుప్రీం కోర్టు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో కౌన్సెలింగ్కు సిద్ధమైంది ప్రభుత్వం. నీట్-పీజీ ప్రవేశాలు జనవరి 12న ప్రారంభవుతాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా తెలిపారు.
వివాదం ఏమిటి?
ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి నీట్ పీజీ ఆల్‌ఇండియా కోటాలో ఓబీసీలకు 27శాతం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (ఈడబ్ల్యూఎస్)లకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2021, జులై 29న మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నోటిషికేషన్ జారీ చేసింది. అయితే, ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొంతమంది నీట్ అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పీజీ మెడికల్ కోర్సుల్లో రిజర్వేషన్ల విషయమై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా నీట్ పీజీలో రిజర్వేషన్లు కేటాయించారని, దీనివల్ల జనరల్ కేటగిరీ విద్యార్థులకు అవకాశాలు తగ్గిపోయి మైనార్టీలుగా మిగిలిపోతారని పిటిషనర్లు ఆరోపించారు. ఇది ప్రతిభావంతులకు అవకాశాలు నిరాకరించడమే అవుతుందని పేర్కొన్నారు.