Resident doctors protest: నీట్- పీజీ 2021 కౌన్సిలింగ్ నిర్వహణలో జాప్యంపై రెసిడెంట్ వైద్యులు చేపట్టిన నిరసనల ఫలితంగా దిల్లీలోని రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ఆస్పత్రుల్లో రోగులకు చికిత్స అందించేందుకు వైద్యులు బుధవారం అందుబాటులో లేకుండా పోయారు. ఈ ఆందోళనల్లో రెసిడెంట్ డాక్టర్ అసోసియేషన్(ఆర్డీఏ) సభ్యులు భారీగా పాల్గొంటున్నారు.
NEET PG counselling: సోమవారం నాటి ఆందోళనలో వైద్యులపై పోలీసులు దాడి చేయడాన్ని నిరసిస్తూ... తాము సేవలను బహిష్కరిస్తున్నామని దిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి(ఆర్జీఎస్ఎస్హెచ్) చెందిన రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్(ఆర్డీఏ) ఓ ప్రకటనలో తెలిపింది. నీట్-పీజీ కౌన్సిలింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేసింది.
"సీనియర్ రెసిడెంట్లు, జూనియర్ రెసిడెంట్లు ఈరోజు నుంచి విధులు బహిష్కరిస్తున్నారు. అయితే... మేం రోగులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం" అని ఆర్జీఎస్ఎస్హెచ్కు చెందిన ఓ సీనియర్ వైద్యుడు తెలిపారు. రోజూ 900 నుంచి 2000 మంది రోగులు తమ ఆస్పత్రిలోని ఔట్పేషంట్ విభాగానికి వస్తారని చెప్పారు.
Delhi Doctors stir: ఆర్డీఏ సభ్యులతో పాటు చాచా నెహ్రూ బాల్ చికిత్సాలయ, ఉత్తర రైల్వే కేంద్ర ఆస్పత్రి వైద్యులు కూడా సేవలను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు.
బుధవారంతో... వైద్యులు చేపట్టిన నిరసనలు 13వ రోజుకు చేరుకున్నాయి. 'మా సమ్మె ఇంకా కొనసాగుతూనే ఉంది' అని ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్(ఫోర్డా) అధ్యక్షుడు డాక్టర్ మనీశ్ కుమార్ స్పష్టం చేశారు.
వైద్యులు లేక విలవిల..