NEET Controversy kerala: కేరళలో నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థినులను లోదుస్తులు విప్పాలని ఓ కళాశాల యాజమాన్యం కోరడం వివాదాస్పదమైన నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చర్యలకు ఉపక్రమించింది. ఈ ఘటనపై నిజనిర్ధరణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. వివిధ మీడియా కథనాల ద్వారా తమకు సమాచారం అందిందని.. దాని ప్రకారం కమిటీ ఏర్పాటు చేసినట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. కమిటీ సభ్యులు కొల్లంను సందర్శించి నివేదిక రూపొందిస్తారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. దాని ఆధారంగా తుది చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు, ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఐదుగురు మహిళలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరంతా పరీక్ష జరిగిన రోజున కళాశాలలో విధులు నిర్వర్తించినట్లు తెలిపారు.
విషయం ఏంటంటే..
ఆదివారం కేరళలో నీట్ పరీక్షకు హాజరైన పలువురు విద్యార్థినులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. పరీక్షా కేంద్రంలోకి వెళ్లే ముందు నిర్వహించే తనిఖీల్లో భాగంగా లోదుస్తులను విప్పాలని సిబ్బంది బలవంతం చేసినట్లు కొందరు విద్యార్థినులు ఆరోపించారు. కొల్లాం జిల్లా ఆయుర్‌లోని మార్థోమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఈ ఘటన జరిగింది. పరీక్షా కేంద్రం వద్ద తమను తనిఖీల పేరుతో లోదుస్తులు విప్పాలని సిబ్బంది సూచించారని బాధిత యువతి పేర్కొంది. లోదుస్తులు తీసేసిన తర్వాతే అనుమతించారని తెలిపింది. దీనిపై యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.