దేశ రాజధాని దిల్లీలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సభ్య దేశాల రక్షణమంత్రుల సమావేశంలో.. పాకిస్థాన్ ఉగ్ర వైఖరిపై భారత్ మండిపడింది. చైనా, రష్యా రక్షణ మంత్రుల సాక్షిగా పాకిస్థాన్‌కు పరోక్ష హెచ్చరికలు చేశారు. చైనా రక్షణమంత్రి లీ షాంగ్‌ఫు, రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు, తజికిస్థాన్ కల్నల్ జనరల్ షెరాలీ మిర్జో, ఇరాన్ బ్రిగేడియర్ జనరల్ మహ్మద్ రెజా ఘరాయ్, కజకిస్థాన్ కల్నల్ జనరల్ రుస్లాన్ సహా పలు దేశాల రక్షణ మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన రాజ్‌నాథ్.. పాక్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అంతం చేయాల్సిందే అన్న భారత రక్షణ మంత్రి.. ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం మానవాళికి వ్యతిరేకంగా చేసే పెద్ద నేరమని స్పష్టం చేశారు. శాంతి, శ్రేయస్సు, సౌభ్రాతృత్వం అని ఉగ్రవాద ముప్పుతో అంతం అవుతాయని రాజ్‌నాథ్ అభిప్రాయపడ్డారు.
సీమాంతర ఉగ్రవాదంపై పాక్ వైఖరిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ మండిపడ్డారు. ఒక దేశం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తే.. అది ఇతర దేశాలతో పాటు ఆశ్రయం ఇచ్చిన దేశానికి కూడా ప్రమాదమే అని పాక్‌కు హితవు పలికారు. సామాజిక-ఆర్థిక పురోగతికి ఉగ్రవాదం పెద్ద అవరోధమని రాజ్‌నాథ్ అన్నారు. తీవ్రవాదానికి మద్దతిచ్చే దేశాలను జవాబుదారీగా చేసేందుకు కృషి చేయాలని SCO సభ్యదేశాలను రాజ్‌నాథ్ సూచించారు. SCO సభ్య దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతలను పరస్పరం గౌరవించే ప్రాంతీయ సహకారాన్ని భారత్ కోరుకుంటుందని వెల్లడించారు. SCO సభ్య దేశాల మధ్య విశ్వాసం, సహకారాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
ప్రపంచం ముందున్న సవాళ్లు చర్చించడానికి.. వాటి పరిష్కారాలను కనుగొనడానికి షాంఘై సహకార సంస్థ (SCO) ఓ ముఖ్యమైన వేదికని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. సభ్య దేశాల మధ్య రక్షణ సహకారాన్ని ప్రోత్సహించే సంస్థగా SCOను భారత్ చూస్తోందని చెప్పారు. SCO సభ్య దేశాల మధ్య విశ్వాసం, సహకార స్ఫూర్తి మరింత బలోపేతం కావాలని సూచించారు. SCOను మరింత బలమైన, విశ్వసనీయమైన అంతర్జాతీయ సంస్థగా మార్చాలంటే.. ఉగ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కోవడమే అత్యంత ప్రాధాన్యం అంశం కావాలని రాజ్‌నాథ్ ఆకాంక్షించారు. కలిసి నడుద్దాం.. కలిసి ముందుకు సాగుదాం అనే నివాదంతో ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు.