PM Modi Indian Economy: అంతర్జాతీయ వ్యాపారం, సరఫరా గొలుసులో భారత దేశ బ్యాంకులతోపాటు కరెన్సీకి కీలక భాగస్వామ్యాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ శాఖ చేపట్టిన ఐకానిక్ వారోత్సవాలను ప్రధాని సోమవారం ప్రారంభించారు. 12 ప్రభుత్వ పథకాల్లో భాగంగా యువత, వ్యాపారులు, రైతులకు సులభంగా రుణాలు అందించేందుకు ఏర్పాటు చేసిన 'జన సమర్థ్ పోర్టల్'ను ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. కేంద్రం సమకూర్చిన పక్కా ఇళ్లు, విద్యుత్, గ్యాస్, తాగునీరు, ఉచిత వైద్యం.. పేదల గౌరవాన్ని పెంచాయని తెలిపారు.
"స్వాతంత్ర్య దినోత్సవ 75ఏళ్ల ఉత‌్సవాన్ని నిర్వహించుకుంటున్న ప్రస్తుత తరుణంలో దేశ అభివృద్ధి కోసం తమ తమ స్థాయిల్లో కృషి చేయడం ప్రతి ఒక్క భారతీయుడి కర్తవ్యం. ఆర్థిక సమ్మిళిత కోసం మేము ఒక వేదికను తయారు చేశాం. దాని ఉపయోగాల గురించి అవగాహన పెంచాలి. మన బ్యాంకులు, కరెన్సీ.. అంతర్జాతీయ సరఫరా గొలుసు, వ్యాపారంలో కీలక భాగస్వామి కావడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది."
-- ప్రధాని మోదీ